దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
ప్రజాశక్తి-దగదర్తి : మండలంలో ఇటీవల దళితులపై వరుసగా జరుగుతున్న దాడులు అరికట్టాలి అని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉలవపాళ్ల, అనంతవరం పంచాయతీకి చెందిన లయన్స్‌నగర్ కాలనీ, దగదర్తి, చెన్నూరు, రంగసముద్రం గ్రామాలలో పర్యటించి దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగసముద్రం గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని అలాగే రాష్ట్రంలోనూ దాడులు పెరుగుతున్నాయన్నారు. దగదర్తి మండలంలో ఉప్పలపాడు, ఉలవపాళ్ల, చెన్నూరు గ్రామాలలో దళితుల దాడులు జరిగాయన్నారు. దళితులకు అండగా నిలవాల్సిన పోలీసులు దళితులపై దాడి చేసిన కౌంటర్ కేసులు పెట్టి వేధించడం అన్యాయమని తెలిపారు. దళితులకు అండగా నిలబడేందుకోసం 8వ తేదీ ఉదయం 10 గంటలకు దగదర్తిలోని జక్కా వెంకయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సులో దగదర్తిలోని ప్రజలు, దళిత సంఘాలు, మేధావులు పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ రఘురామయ్య, ఆలూరి తిరుపాలు, మండల నాయకులు కర్ర పోలయ్య, ఒంటేరు సుధాకర్, మందా సీనయ్య, తలారి రవి, వడ్లపూడి శూలాం, తదితరులు పాల్గొన్నారు.










