దళితులపై దాడులు చేసే వారిని శిక్షించాలి
- డిఎఒకు కెవిపిఎస్, వ్య.కా.సం. వినతి
ప్రజాశక్తి-కావలి : కావలి డివిజన్ పరిధిలో ఇటీవల పలు ప్రాంతాలలో దళితులపై దాడులు చేస్తున్న రాజకీయ పార్టీలకు చెందిన అగ్రవర్ణ, పెత్తందార్లను కఠినంగా శిక్షించాలని, తద్వారా దళితులు కూడా ఇతర అన్ని కులాలతో సమానమని, వారికీ ధైర్యం కలిగించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష పోరాట సంఘాల నాయకులు కావలి ఆర్‌డిఒను కోరారు. ఈ మేరకు శనివారం ఆర్.డి.ఒ. కార్యాలయ డి.ఎ.ఒ. ఆర్.సూర్యనారాయణ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్య.కా.సం. జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ కావలి డివిజన్‌లోని కొండాపురం మండలం రామాంజపురంలో దళిత బాలికపై అత్యాచారం, కావలి మండలం ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య, బోగోలు మండలం, కడనూతలకు చెందిన పైడి హర్ష ఆత్మహత్యాయత్నం, దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామ దళితుడు గోచిపాతల తేజపై ఎంపిటిసి మహేష్ నాయుడు దాడి చేసి దారుణంగా కొట్టడం వంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఈ ఘటనలను ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌లు ఖండిస్తున్నాయన్నారు. ఆయా ఘటనలలో అకృత్యాలకు పాల్పడిన నిందితులపై అట్రాసిటీ కేసులు, నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు, దళితులకు భద్రత కల్పించేందుకు సంబంధిత రెవెన్యూ, పోలీసు శాఖలు కృషి చేసేలా ఆర్.డి.ఒ. చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కావలి మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సీతారామయ్య, కెవిపిఎస్ నాయకులు కె.జాన్, రాకేష్, యాకసిరి లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.










