బాధితుడిని పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు
దళితులపై దాడులు అమానుషం
-సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్
నెల్లూరు :రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో దళితులపై వరుసగా జరుగుతున్నయని, గ్రామాలల్లో తమ ఆధిపత్యం కోసం అగ్రవర్ణాలకు చెందిన వారు దళితులపై దాడులకు పాల్పడటం అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. జనవరి ఒకటో తేదీ దగదర్తి మండలం ఉలవ పాళ్ల హైవే పై ఐ ఓసి పెట్రోల్ బంకు లో పనిచేస్తున్న గోచిపాతల తేజ పై అదే మండలంలోని బాడుగులపాడు ఎంపీటీసీ సభ్యుడు, వైసిపి నాయకులు మహేష్ నాయుడు తన ట్రాక్టర్‌కు డీజల్ అప్పు పోయే లేదన్న కారణంతో తన అనుచరులతో వచ్చి ఆ యువకుడిపై తీవ్రంగా దాడికి పాల్పడటమే కాకుండా హత్యాయత్యానికి పాల్పడిన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి జిజిహెచ్‌లో చికిత్సలు పొందుతున్న బాధితుడిని సిపిఎం, కెవిపిఎస్ , ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ చదువుకుంటూ , తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పెట్రోల్ బంకులో జి.తేజా పనిచేస్తున్నాడన్నారు. వైసిపి నాయకులు తమ ట్రాక్టర్‌కు డీజల్ అప్పుగా పోయకపోవడం లేదన్న సమాచారం అందుకొని తన అనుచరులతో పెట్రోల్ బంకు వద్దకు చేరుకొని విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేయడం, కాళ్లతో తన్నడం, కులం పేరుతో దూషించడం వంటి చర్యలకు పాల్పడటం వంటి దృశ్యాలను సోషల్ మీడియాలో కథనాల రూపంలో హల్‌చల్ చేయడం ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వైద్య చికిత్సల నిమిత్తంకావలి ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారన్నారు. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్ళాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం జిజిహెచ్‌లో చికిత్సలు తీసుకుంటున్నారన్నారు. జిల్లాలో దళితులపై దాడులు తీవ్రమయ్యాయని దళితులపై దాడులు చేసిన వారిని కఠిన శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ వైఫల్యం చెందుతుందన్నారు. ఈ కారణంతో దళితులపై దాడులు హత్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. పోలీసులు నిందితులపై అట్రాసిటీ కేసులు పెట్టడం లేదని,దీనితో అట్రాసిటీస్ కేసులు నీరుగార్చేందుకు సహయపడుతున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసు శాఖ స్పందించి నిందితులను కఠినంగా శిక్షించి జిల్లాలో దళితులపై దాడులు జరగకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోచపాతల తేజ విషయంలో కావలి డిఎస్‌పి న్యాయ పరంగా విచారణ జరిపి నిందితులపై అట్రాసిటీ కేసు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జొన్నలగడ్డ వెంకమరాజు , ఎం పుల్లయ్య, సిఐటియు నాయకులు ఆర్ నగేష్, ఐలు నాయకులు విద్యాచరణ్, ఎంఆర్‌పిఎస్ నాయకులు మంచు తిరపతయ్య, ఎం ఎస్ పి నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, చేవూరు కిరణ్, గేరా జానకి తదితరులు పాల్గొన్నారు.










