దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
ప్రజాశక్తి-కావలి : నియోజకవర్గంలో దాడికి గురైన దళితులకు న్యాయం చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని కావలి అఖిలపక్ష నేతలు తాళ్లూరు మాల్యాద్రి (సిపిఎం), దామా అంకయ్య (సిపిఐ), జ్యోతి బాబురావు (టిడిపి), కరవది భాస్కర్ (సిపిఐ ఎంఎల్), సాయి విఠల్ (జనసేన) ఆరోపించారు. బుధవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ దళితులపై జరిగిన దాడులలో పోలీస్ వైఫల్యం లేదనటం హస్యాస్పదంగా ఉందన్నారు. కొండాపురం మండలం రామంజపురంలో ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగితే ఆనాటి డిఎస్‌పి ప్రసాద్, అత్యాచారం జరగలేదంటే, మెడికల్ రిపోర్టులో జరిగినట్లు వచ్చిందన్నారు. అత్యాచారానికి గురైన బాలిక తనపై అత్యాచారం చేసింది నలుగురు అని చెప్తున్నా ఇంతవరకు ఒకరినే అరెస్ట్ చేయటానికి కారణం తెలపాలని పోలీసులను కోరారు. అలానే ముసునూరులో దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే, అఖిలపక్షం పోరాటం చేస్తే, కేసును ఫైల్ చేశారన్నారు. అలానే ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పోలీసుల వేధింపులు కారణంగా పైడి హర్ష ఆత్మహత్యాయత్నం చేస్తే పైడి హర్షపైనే కేసు నమోదు చేశారని వాళ్ల భార్య, అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఇంత వరకు చర్యలు లేవన్నారు. అది మరవకముందే ఉలవపాళ్ల పెట్రోల్ బంకులో పనిచేస్తున్న గోచిపాతల తేజపై వైసిపి నేతలు మహేనాయుడు ఆయన అనుచరులు కాళ్లతో, కర్రలతో, రాడ్డులతో దాడి చేస్తే 307 కేసు బుక్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వటం ఇది జిల్లా ఎస్‌పికి కనబడటం లేదా? అన్నారు. పైడి హర్ష విషయంలో పూర్తిగా ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్ రెడ్డి పోలీసులే కారణమన్నారు. వారిపై ఇంత వరకు కేసు ఎందుకు బుక్ చేయలేదో తెలపాలన్నారు. ఇలా దళితులపై దాడులు జరిగినా పోలీస్ వ్యవస్థ న్యాయం చేయకపోవటం వల్లే చలో కావలి పిలుపు నిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం, పోలీసులు చేస్తున్నారన్నారు. జిఒ నెంబర్ 1 తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బ్రిటీష్ పాలనను కొనసాగించాలంటే అది కుదరదన్నారు. ఈ సందర్భంగా చలో కావలి కార్యక్రమానికి పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా జయప్రదం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలానే దళితులపై దాడులకు ప్రేరేపించిన, చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొనే వరకు ఈ ఉద్యమం ఆగదని తెలిపారు. కార్యక్రమంలో సుర్యప్రకాష్, శివ, మురళి, అజరు, రవి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.










