May 15,2023 21:57

ఫొటో : మాట్లాడుతున్న ఆర్‌డిఒకు సమస్యను తెలియజేస్తున్న బాధితులు

దళితుల భూముల్లో దురాక్రమణ తొలగించండి
ప్రజాశక్తి-కావలి : తమ అనుభవంలో ఉన్న గ్రామనత్తం భూమిని బాలిరెడ్డి ఆక్రమించుకున్నారని, దళితుల భూమి నుండి బాలిరెడ్డిని తొలగించాలని బోగోలు మండలం పాతబిట్రగుంట గ్రామ దళితులు ఆర్‌డిఒను కోరారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లితో కలిసి సోమవారం ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోగోలు మండలంలోని పాతబిట్రగుంట గ్రామ అరుంధతీయవాడకు చెందిన సర్వే నెంబర్‌ 358లో 0.60 సెంట్లు గ్రామనత్తం భూమిని దాదాపుగా 70 సంవత్సరాల నుండి గ్రామ అవసరాలకు వాడుకుంటున్నామని తెలియజేశారు. పశువుల కొట్టాలు ఇతర అవసరాలకి వాడుతున్నామని తెలియజేశారు. కొంతకాలం వాకా బాలిరెడ్డి కొంత భాగంలో గడ్డివాములు వేసుకున్నారని, ప్రస్తుతం ఆ భూమి అంతా తనది అని అంటున్నారని వాపోయారు. వారి ఊరు ఇక్కడ కాదని, దూరమని తెలియజేశారు. తమ కాలనీలో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకొని గడ్డివాములు వేసుకుంటున్నారని, తాము ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, ఈ విషయం అనేకసార్లు కలెక్టర్‌ దృష్టికి స్థానిక తహశీల్దార్‌ దృష్టికి తెలియజేశామని తెలిపారు
. గ్రామనత్తం భూమి కాబట్టి ఎవరికి హక్కు లేదని చెప్పారన్నారు. తమ అరుంధతీయవాడ అవసరాల కోసం ఉప యోగించుకున్న భూమిని ఈ విధంగా దౌర్జన్యంగా ఆక్రమించు కోవడం అన్యాయమని తెలియజేశారు. ప్రభుత్వం వారు స్థానిక విఆర్‌ఒ అందరూ ఈ భూమిపై విచారించి ఎవరికి హక్కులు లేవన్నారు. కాబట్టి 70 సంవత్సరాల నుంచి భూమికి తమకు హక్కులు కల్పించి, అరుంధతీయ వాళ్ల మాతమ్మ తిరునాళ్లు, ఇతర శుభకార్యాలకు ఉపయోగించే భూమిని ధనవంతులు గడ్డి వాములకు ఉపయోగించుకోవడం అన్యాయమని తెలియజేశారు. స్థానిక నాయకులు వారికే సపోర్ట్‌ చేస్తున్నారని, మహాలక్ష్మి మెడికల్స్‌ యజమాని దొంగ డాక్యుమెంట్లతో దళిత ఇండ్ల స్థలాలను 20 సంవత్సరాల నుండి దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో కొండమ్మ, రాంబాబు, సత్యవతమ్మ, పలువురు పాల్గొన్నారు.