Jan 12,2023 21:43

వృథాగా ఉన్న టిడ్కో గృహాలను పరిశీలిస్తున్న నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి జిల్లా వ్యాప్తంగా టిట్కో గృహాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులతో కలసి గురువారం పట్టణ సమీపంలోని కర్నాటక నాగేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ టిడిపి హయాంలో పుట్టపర్తి పట్టణంలో 1200 గృహాలు మంజూరు చేశామన్నారు. అందులో కొందరికి టిట్కో మంజూరు చేసి 90 శాతం పూర్తి చేశామన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్‌ వాటిని పూర్తి చేయలేదన్నారు. దీంతో అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన గృహాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయన్నారు. మూడున్నర ఏళ్లు దాటినా జగనన్న కాలనీలు పూర్తికాలేదని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను పూర్తి చేయాలే తప్ప వివక్ష చూపరాదన్నారు. ఇప్పటికైనా టిట్కో గృహాలను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బెస్త చలపతి, నాయకులు మహమ్మద్‌ రఫీ, రాజప్ప, ప్రభాకర్‌, జయప్రకాష్‌, అమ్మినేని కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.