ప్రజాశక్తి-నెల్లూరు :డిసెంబర్ 15,16,17 తేదీల్లో నగరంలో పిడిఎస్‌యు 23వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు, ఈ మహాసభలకు విద్యార్థి, మేధావులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు పిలుపు నిచ్చారు. ఆదివారం నగరంలోని డాక్టర్ జి.విజరుకుమార్ మెమోరియల్ ఆస్పత్రిలో ఈ మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి హాజరైన సర్వోదయ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ్ హాజరై మాట్లాడారు. అనేక సాంఘిక, అభ్యుదయ, విప్లవొద్యమాలకు నిలయమైన నగరంలో పిడిఎస్‌యు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని ఆలోచన రావడం మంచి పరిణామమన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయని, విద్యారంగం సంక్షోభానికి గురై పోతుందన్నారు. జాతీయ విప్లవ వీరుల స్పూర్తితో దోపిడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పిడిఎస్‌యు మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందుత్వ శక్తులు బరితెగిస్తున్న సమయంలో రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహించుకోవడం ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిడిఎస్‌యు జాతీయ కన్వీనర్ ఎం. రామకష్ణ మాట్లాడారు. పిడిఎస్‌యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ సాగర్, పిఒడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పద్మ, ఒనిడిఆర్ ప్రసాద్, ఆర్ శరత్ (ఏపిటిఎఫ్), సిహెచ్ శ్రీనివాస్ లెక్చరర్, పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ రాజశేఖర్, రిట్జ్ శ్రీనన్న టైలర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, వెళ్ళంటి వెంకటేశ్వర్లు (సిఎల్‌సి),పిడిఎస్‌యు మాజీ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్, రమణయ్య, మాల్యాద్రి ( బిటిఎ), అడ్వకేట్స్ నరసింహారావు, శ్రీకాంత్, నక్కా శీనయ్య, శ్రీకాంత్, ఐఎఫ్‌టియు రమేష్, ఎఐకెఎంఎస్ పోలయ్య, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు జాకీర్, జిల్లా అధ్యక్షులు సునీల్, నాయకులు షారుక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఎన్నిక
మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా సర్వోదయ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, అధ్యక్షులుగా బి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఎల్. రాజశేఖర్, కోశాధికారి ఎం. సునీల్ తో సహా 125 మందితొ ఆహ్వాన సంఘం ఏర్పాటైంది.










