డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-మర్రిపాడు : జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గోపినాధ్ మాట్లాడుతూ మురుగు నీరు ఆవాసంగా దోమలు విజృంభిస్తాయని తెలిపారు. ఏడిస్ దోమలు కుట్టడం వల్ల కం డరాలనొప్పి, తీవ్రమైన జ్వరం బారిన పడేలా చేస్తుందని, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అశ్రద్ధ వహిస్తే ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయని, సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కూలర్లు, పూలకుండీలు, వాడేసిన టైర్లు, కొబ్బరి బోండాల్లో నీరు నిల్వవుండడంతో దోమలు ప్రమాదకరంగా తయారవుతాయన్నారు. ఇంటిలో నీళ్ల తొట్టెలను వారానికొకసారి శుభ్రం కడగాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కల్పన, మండల విస్తరణ అధికారి కొండారెడ్డి, సిహెచ్‌ఒ రోస్‌లీన్, సూపర్‌వైజర్లు సైదా, ఖాజామొహిద్దీన్, సచివాలయ ఎఎన్‌ఎం రమణమ్మ, సిద్ధమ్మ ఎల్‌టి రత్నమ్మ, ఆశా సుబ్బమ్మ పాల్గొన్నారు.










