చేయటం చేతకానప్పుడు, చేసినదానిని సమర్ధించుకోవాల్సి వచ్చినప్పుడు- ''అంతా దేవుడి లీల (యాక్ట్ ఆఫ్ గాడ్)'' అనేయటం అనేకమందికి అత్యంత సులువైన పని. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కూడా ఇదే పల్లవిని నింపాదిగా పాడేసింది. రాష్ట్రాలకు జిఎస్టీ నిధుల మంజూరును ఎగ్గొట్టటానికి కరోనాని, దేవుడి లీలనీ కారణంగా చూపించింది. దేవుడి పాటకు తిరుగుండదని వారి బృందానికి ఓ గట్టి నమ్మకం ఉండనే ఉంది. ''దేవుడి మీదికి నెపం.. దాటుకుపోయే మంత్రం'' అన్నది వారి పాలసీ. కానీ, అందరికీ అలాగే ఉండాలని ఏమీ లేదు కదా? ''ఈ పాట పాడేసి, రాష్ట్రాలకు జిఎస్టీ నిధులు ఎగ్గొట్టేద్దామని చూస్తారా? పోనీ, ఆ దేవుడే కరోనాకు, జిఎస్టీ ఎగవేతకీ కారణమైతే- ఆయన గారినే దానికి బాధ్యత వహించమనండి'' అని సర్వోత్తమరావు అనే న్యాయవాది పెద్ద కోర్టులో వ్యాజ్యం వేశాడు. కోర్టు వారు ఏ మూడ్లో ఉన్నారో కానీ, కేసును స్వీకరించటమే కాక; ఏకంగా దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడని చెబుతూ ఉంటారో- అక్కడక్కడికల్లా సమన్లు పంపేశారు. ఆ పరిణామంతో మత పెద్దల పరివారంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది!
ఈ కేసు విచారణకు దేవుడు హాజరు కావాలా, వద్దా అన్నది చర్చ. వస్తే ఏమవుతుంది? కరోనా రావటానికీ, కేంద్ర మంత్రి చెప్పిన ఎగవేతకీ ..వచ్చిన దేవుడు ''తానే కారణమని'' నింద మోయాల్సి ఉంటుంది. ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెట్టేవాడు దేవుడెలా అవుతాడన్న ప్రశ్నలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కారణం దేవుడైతే పరిష్కారం కూడా దేవుడే చూపాల్సి ఉంటుంది. కరోనా బారిన పడ్డ పూజార్లకు, పాస్టర్లకు, ముల్లాలకు డాక్టర్లు దిక్కయ్యారు తప్ప- ఇప్పటిదాకా దేవుడు ఆదుకున్నది ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ దేవుడు బోనెక్కితే-బోలెడు ప్రశ్నలూ, సమస్యలూ ఎదుర్కోవాలి. కాబట్టి- యథావిధిగా వేడుకోళ్లు మొదలయ్యాయి. చాలామంది చెప్పే సూత్రం ప్రకారం... పేరు ఏదన్నా దేవుడు ఒక్కడే కాబట్టి- ఆ దేవుడు ఏ రూపంలో వస్తే - ఆ రూపారాధకులకు ఇబ్బంది. అందుకని 'హాజరైతే అయ్యావు కానీ, రాముడి రూపంలో వొద్ద'ని పూజలు చేసి మొరపెట్టుకున్నారు పూజార్లు. 'ఏసు రూపంలో ఎంతమాత్రం రావొద్ద'ని ప్రార్థనలు చేశారు పాస్టర్లు. అసలు రూపమే లేని అల్లా 'ఇంకే విధంగానైనా హాజరీ అవ్వొద్ద'ని నమాజులో విన్నవించుకున్నారు ముల్లాలు.
ఈ తంతునంతా తిలకించి, చిన్నగా నవ్వుకున్నాడు దేవుడు. వాళ్ల కోరికను మన్నిస్తూనేా హాజరవ్వడమైతే పక్కా అని గట్టిగా తీర్మానించుకున్నాడు. కోర్టు వారు సూచించిన రోజున హాజరయ్యాడు. నేనే దేవుణ్ణని ఎంత చెప్పుకున్నా తొలుత నమ్మలేదు కోర్టు. ''మన దేవుడు కానప్పుడు మనమెందుకు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. దేవుడు అవునో కాదో తానే నిరూపించుకోనీ ... '' అని మిన్నకుండిపోయారు మతాధిపతులు. ఏదొకలా కోర్టు వారికి నమ్మకం కలిగించి, తన వాదన చెప్పుకోవటానికి బోనెక్కాడు మనిషి రూపంలోని దేవుడు!
''అయ్యా కోర్టు వారు.. సర్వోత్తమరావు గారి అభియోగాలను ఆమూలాగ్రం చదివాను. అందులో ఏ ఒక్కదానికీ నేను కారణం కాదు. వాస్తవానికి నేను నిమిత్తమాత్రుణ్ణి. నేను ఎక్కడ, ఏవిధంగా, ఏ రూపంలో ఉండాలో ఎల్లప్పుడూ ఈ మతపెద్దలే నిర్ణయించారు. నాకు ఏం కావాలో నేనెప్పుడూ కోరలేదు. కావాల్సిస్తే వీళ్లనే అడగండి.. నేనెప్పుడైనా వీరితో నోరిప్పి మాట్లాడానేమో! నాకు రూపం, మహాత్యం, కథ, ఆడంబరం, అలంకరణా ... అంతా మనుషులే కల్పించారు. కరోనా ప్రారంభంలో నా మందిరం తలుపులు మూస్తే వద్దని నా నోరు పెగల్లేదు. మళ్లీ తెరిస్తే సంతోషంతో నా ముఖం వెలగనూ లేదు. నిజానికి నేను అలంకార మాత్రుణ్ణి. అశక్తుణ్ణి. ఇక్కడ జరిగే అన్నిటికీ మనుషులు కారణం తప్ప - నేను కానే కాదు. కరోనా రావటానికి నేను కారణం కాదు. నిర్మలమ్మ యాక్ట్ ఆఫ్ గాడ్ అనే మాటకూ నేను బాధ్యుణ్ని కాదు. జిఎస్టీకి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం. పట్టుబట్టి బాకీ వసూలు చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు.'' అన్నాడు దేవుడు.
కోర్టు నిండా నిశ్శబ్దం ఆవరించింది. ఓ గ్లాసెడు మంచినీళ్లు తాగి, గొంతు సవరించుకొని, మళ్లీ మాట్లాడ్డం మొదలెట్టాడు మనుష్య రూప దేవుడు.
''కోర్టు వారికి మరో మనవి. ఈ అంశంతో సంబంధం లేనిది అయినప్పటికీ ఓ విజ్ఞప్తి. దేశంలో జరిగే విషయాలన్నిటిలో నాకు ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. ఇకపై ఉండదు కూడా. కాబట్టిా వివిధ వివాదాల్లోకి నన్ను లాగటాన్ని నివారించండి. నా పేరిట జరిగే ఘోరాలను, దారుణాలను అడ్డుకొండి. నా మీద నెపం మోసి, పబ్బం గడుపుకునేవారిని శిక్షించండి. మళ్లీ చెబుతున్నాను. ఇక్కడ జరిగే ప్రతి మంచికీ, చెడ్డకీ కారణం మనుషులే! అభినందనైనా, అభిశంసనైనా వారికే దక్కాలి!'' అని విన్నవించుకున్నాడు.
మతాధిపతులు ముగ్గురూ ఏకమై ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిర్మలమ్మ బృందం నివ్వెరపోయి, చూస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెబుతుందా అని దేశమంతా కళ్లు ఇంతింత చేసుకొని ఎదురు చూస్తోంది. అప్పుడే కళ్లు తెరిచి కలలోంచి మేల్కన్నాడు, కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్న సర్వోత్తమరావు.










