ప్రజాశక్తి-గుంతకల్లు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా, లేబర్ కోడ్ల రద్దు, సమానపనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మెడలు వంచేలా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కషిచేద్దామని వామపక్ష ట్రేడ్ యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 28, 29న దేశవ్యాప్త సమ్మె సందర్భంగా స్థానిక హంపిరెడ్డి భవనంలో ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు, ఎఐటియుసి, ఐఎస్‌టియు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు కసాపురం రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కేంద్రం విధానాలతో కార్మికులకు కనీస వేతనాలు, సమానపనికి సమాన వేతనం, రెగ్యుల రైజేషన్, కార్మిక సంక్షేమా లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ యాజమానులకు ఊడిగం చేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీ, టాటాలకు బదిలీ చేస్తోందని మండిపడ్డారు. కరోనా సమయంలో ఉపాధి లేని కార్మికులను ఆదుకునే బాధ్యతను మోడీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, కార్మిక హక్కులను పరిరక్షించుకోవటానికి మార్చి 28, 29 రెండు రోజుల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు, ఎఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ఐఎఫ్‌టియు పట్టణ కార్యదర్శి చిన్న, సిఐటియు నాయకులు నరసయ్య, తిమ్మప్ప, ఎస్‌కెఎం.బాషా, ఎఐటియుసి నాయకులు కొండయ్య, నాగరాజు, ఐఎఫ్‌టియు నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగమణి మండల అధ్యక్ష కార్యదర్శులు నాగరాణి శివ కుమార్ సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గంగమ్మగుడి వద్ద సమావేశం నిర్వహించారు. ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మెలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి నాయకులు ఈశ్వర్ రెడ్డి, శివయ్య, సుధాకర్, రామాంజనేయులు, వ్యవసాయ కూలీ సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, గుత్తి సిఐటియు మండల కార్యదర్శి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి రూరల్ : ఈనెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్జస్ స్టీల్ ప్లాంట్ వద్ద సమ్మె సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్మోహన్‌రెడ్డి, నాగరాజు, చంటి, హనుమంతు, రాముడు, హనుమంతరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలను కడవకల్లు గ్రామంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రామాంజి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి, వెంకట చౌదరి, అంగన్వాడీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపప్పూరు : 28,29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ బాలు, ఆశాలు పాల్గొన్నారు.










