మాట్లాడుతున్న వామపక్ష నాయకులు
దేశ సంపదను కార్పోరేట్లకు దోచిపెడుతున్న బిజెపి
-మార్చి 14 నుంచి వామపక్ష పార్టీల ప్రచారం
నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాద ముసుగులో దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందని, బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 14 నుండి జరుగు ప్రచార క్యాంపియన్ జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్ ), భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలోని డాక్టర్ రామచంద్ర రెడ్డి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య లు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రజాస్వామిక విలువలను, స్వేచ్ఛను కాలరాస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను దేశద్రోహ చట్టాల పేరుతో అణచివేతకు పాల్పడుతున్నారని , ప్రతిపక్షాలను సిబిఐ, ఈడి లను ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతూ వారి నోరు నొక్కేప్రయత్నం చేస్తున్నారన్నారు . కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్పు చేయడమే కాకుండా ఆరుగాలలపాటు కష్టపడి నిద్రాహారాలు మాని వ్యవసాయం చేసి పండించిన పంటకు గిట్టు బాటు ధరను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను,వనరులను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రోజువారి పెంచుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. అదాని,అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్న వైనాన్ని హిండెన్ బర్గ్ ఆధారాలతో బయటపెట్టినప్పటికీ పార్లమెంటులో ప్రధాని మౌనం పాటిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బిజెపి విధానాలకు వంత పాడుతున్నదని అన్నారు. ప్రత్యేక హౌదా,పోలవరానికి నిధులు, విభజన చట్ట హామీలు అమలు చేయని బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బిజెపికి సాగిలా పడడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని సంస్కరణలకు ప్రయోగశాలగా జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, నేలటూరు జెన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలన్నింటిని అదానీ కంపెనీలకు అప్పనంగా అప్పజెప్పుతున్నారని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం - సిపిఐ చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, చండ్ర రాజగోపాల్, కె.అజరు కుమార్ సిపిఐ నాయకులు వి.రామరాజు, సిరాజ్, రమణయ్య సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్ బి, పి శ్రీరాములు, పొట్టేపాలెం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.










