రాయచోటి టౌన్ : దేశ సంపదను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ డబుల్ ఇంజన్‌తో లూటీ చేస్తున్నారని, వ్యవసాయ కార్మికులు, రైతులు కార్మికుల ఐక్య ప్రతిఘటన లాంటి ట్రిబులింజన్‌తో ఎదుర్కొందామని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఉమ్మడి సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జయరామయ్య, రైతు సంఘం అధ్యక్షులు ఎస్.రామచంద్ర అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రెండో సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల అభివృద్ధే దేశ అభివృద్ధిగా పనిచేస్తోందని విమర్శించారు. దేశ ప్రగతిలో చెమటోడ్చుతున్న వ్యవసాయ కూలీలు, రైతులు కార్మికుల సంక్షేమం కోసం ఉన్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేయడంతో పాటు కార్పొరేట్లకు ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసి, బ్యాంకింగ్, రైల్వే, నేవీ, బిఎస్‌ఎన్‌ఎల్ పరిశ్రమలను ప్రయివేట్ పరం చేసి రూ.లక్షల కోట్ల రాయితీలిచ్చి మళ్లీ రుణమాఫీ చేయడం వలనే దేశంలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ నల్లచట్టాలను రైతు ఉద్యమం తిప్పి కొట్టడం చారిత్రాత్మక విజయమని తెలిపారు. మహారాష్ట్రలో విద్యుత్ ప్రయివేటీకరణను కార్మికుల తీవ్ర ప్రతిఘటన కారణంగా ప్రభత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జిఒ నంబర్ 1 రద్దు చేయాలని ప్రజానీకం ఒత్తిడికి ప్రభుత్వం ఉపసంహరించుకొందని పేర్కొన్నారు. నూతన విద్యావిధానం, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడంతో అటు నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు పాటు వ్యవసాయ సంక్షోభం ముదిరి ఆహార భద్రత ఏర్పడుతుందన్నారు. మతోన్మాద విధానాలు దేశ ప్రగతికి ఆటంకమని మతసామరస్యంతో మెలగాలని కోరారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల సరకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజానీకం నడ్డి విరుస్తున్నారని మహిళల మీద నిత్యం దాడులు మానబంగాల నివారణకు కృషి చేయలేని దశలో ప్రభుత్వాలుండడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు పనిగంటలు పెంచడం సంఘం పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికి ఏప్రిల్ 5న ఢల్లీీలో కార్మిక కర్షక సంఘర్ష్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు, రైతు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, కె.నాగబసిరెడ్డి, పి.మణి, బి.రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్.రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు జి.రెడ్డెప్ప, సి.రవికుమార్, ఎస్.మెహరున్నీసా, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ఫయాజ్ ఎం.లక్ష్మి దేవి, పి.నాగరాజమ్మ, దాసరి జయచంద్ర, కె.వెంకటరమణ, సుకుమారి, సుజాత, పరంజ్యోతి, కెవిపిఎస్ జిల్లా కో-కన్వీనర్ డిసి.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు వి.రమణారెడ్డి. ఎన్.వెంకటరమణారెడ్డి, ఎ.చెంగయ్య, హరి, ఆర్.రెడ్డెయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివయ్య, హరిప్రసాద్, పెంచల్‌రెడ్డి, పి.వెంకటేష్, దిలీప్ పాల్గొన్నారు.










