Jul 07,2022 22:48

  • కలెక్టర్‌ డిల్లీరావు

ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్శిటీ: జనాభా నియంత్రణ దేశ పురోగతికి దోహదపడుతుందని ప్రతిఒక్కరు జనాభా నియంత్రణ పాటించి పరిమిత కుటుంబంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ నియంత్రణ పాటించిన వారికి వైద్య ఆరోగ్య శాఖ అందించే ప్రోత్సహక బహుమతుల కొరకు గురువారం లాటరీ పద్దతి ద్వారా జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అదర్శ దంపతులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న అధిక జనాభా వలన ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కుటుంబ నియంత్రణ ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన కల్పించి కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించేలా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మరింత ప్రచారం నిర్వహించాలన్నారు. పిపిఐ, యుసిడి వేయించుకున్న అర్హులైన దంపతులలో ఒకరిని, అంతర ఇంజక్షన్‌ చేయించుకున్న అర్హులైన దంపతులలో ఒకరిని లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి ఒకొక్కరికి 1000 రూపాయల ప్రోత్సాహక బహుమతిగా అందించడం జరగుతుందన్నారు. ఈ నెల 11 నుండి 24వ తేదీ వరకు తాత్కాలిక మరియు శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని జనాభా నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం కుటుంబ నియంత్రణలో శాశ్వత, తాత్కాలిక పద్దతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ యం సుహసిని, జిల్లా గణనంకాధికారి ఎస్‌.లక్ష్మోజి, వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు డా. నవీన్‌, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.