కేంద్ర ప్రభుత్వ రంగంలో గల ప్రతిష్టాత్మక నవరత్న కంపెనీల్లో అతి ముఖ్యమైనది మన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్). 1970లలో అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ వద్ద ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తానని ప్రకటించి, అంతలోనే వేరే ప్రాంతానికి తరలించే కుయుక్తులు పన్నినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తూ కదన రంగంలోకి ఉరికింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో సాగిన సమరశీల సమరంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఎందరో పోలీస్ లాఠీ ఛార్జీలకు, నిర్బంధాలకు గురయ్యారు. ప్రజా పోరాటాలకు కేంద్రంలోని కాంగ్రెస్ వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దిగిరాక తప్పలేదు. 1980లలో అంకురార్పణ జరిగిన ఉక్కు కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగింది. విశాఖ స్టీల్ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారం. 21 వేల ఎకరాల్లో దేశంలోనే సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీ. స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలొస్తాయని ఆనాడు యువత మహోద్యమం నిర్వహించి సాధించుకున్నారు. ఈ పరిశ్రమలో 35 వేల మంది ప్రత్యక్షంగా, మరో 65 వేల మంది పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. వార్షిక టర్నోవర్ రూ.20 వేల కోట్లకుపైనే. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు వేల లోపే పెట్టుబడి పెట్టింది. కానీ నేటికి రూ.44 వేల కోట్లకు పైగా పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైజాగ్ స్టీల్ చెల్లించింది. స్టీల్ ప్లాంట్ తన సొంత ఆదాయంతో సాలీన 32 నుండి 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించింది. విశాఖ స్టీల్ కార్మికుల, చెమట, రక్తం, ప్రాణ త్యాగాలతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి.
బంగారు బాతు వంటి స్టీల్ ప్లాంట్‌ను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళ అదే అదనుగా 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ విశాఖ స్టీల్‌ను వంద శాతం అమ్మాలని నిర్ణయించింది. అప్పటి లగాయత్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేశారు. బంద్‌లు, ధర్నాలు, సదస్సులు, పాదయాత్రలతో హోరెత్తించారు. విశాల ప్రజల మద్దతు కూడగడుతున్నారు. బిజెపి మినహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి పోరాటానికి మద్దతు సాధించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఇంతగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం వెనక్కు తగ్గట్లేదు సరికదా ఒకటికి పదిసార్లు విశాఖ స్టీల్‌ను అమ్మి తీరతామని పార్లమెంట్‌లో, బయటా బిజెపి పెద్దలు గంటాపథంగా చెబుతున్నారు.
ప్రభుత్వరంగం ఏర్పాటు ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష స్వాతంత్రోద్యమంలో పుట్టింది. అందుకనుగుణంగానే స్వాతంత్య్రం సిద్ధించాక అప్పటి యుఎస్‌ఎస్‌ఆర్ అండతో ప్రభుత్వరంగ నిర్మాణం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదేశించేంత ఎత్తులో ప్రభుత్వ రంగాన్ని నిర్మిస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారు. మోడీ ప్రభు త్వం రాజ్యాంగ స్వభావానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రజా సహకారంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించాలని, తెగనమ్మాలని చూస్తోంది. మోనిటై జేషన్, ప్రైవేటైజేషన్ అని పేరు పెట్టింది. ప్రైవేటీకరణ అంటే విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా గుత్త పెట్టుబడిదారులకు, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడం. రాజ్యం తన బాధ్యత నుండి వదిలించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను వలస ఆధిపత్యం కిందకు చేర్చడం, మన ఆర్థిక వ్యవస్థను పశ్చిమ సంపన్న దేశాలకు ధారాదత్తం చేయడం రాజ్యాంగ ఆదేశిత సూత్రాలకు విరుద్ధం. సంపదను కార్పొరేట్లు చేజిక్కించుకోవడం వలన ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. సంపదలో అసమానతలు పెరిగితే ఆదాయాల్లో అంతరాలు పెరుగుతాయి. సమానత్వాన్ని ప్రబోధిస్తున్న రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే. ఈ రీత్యా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం స్వాతంత్య్రోద్యమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందని చెప్పాలి. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్ముతామని మరో పెద్ద ద్రోహానికి ఒడిగట్టింది. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఆంధ్రసీమలో పుట్టిన ప్రతి ఒక్కరూ కదలాలి.
- కెఎస్‌వి ప్రసాద్










