May 15,2023 21:34

చెల్లా చెదురుగా పడిన మృత దేహాలు

కొండాపురం : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. తిరుమలకు వెళ్లి ఏడు కొండల స్వామిని దర్శించుకొని వస్తుండగా, జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 5.15 గంటలకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటకలోని బళ్లారి జిల్లా కంప్లీకొట్టాలకు చెందిన 14 మంది బంధువులు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనానికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం అదే వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మరో 20 నిమిషాలలో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో వైఎస్‌ఆర్‌ జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలో వీరందరూ ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనాన్ని తాడిపత్రి వైపు నుంచి కడప వైపుకు వెళుతున్న పది టైర్ల లారీ అదుపుతప్ప ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుర్మరణం పాలైన వారిలో నలుగురు మహిళలు ఒక బాలుడు, ఓ అవివాహితుడు, డ్రైవరు ఉన్నారు. గాయపడిన ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పోలీసులు సహాయంతో అంబులెన్స్‌ వాహనాన్ని పిలిపించి తాడిపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చేటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీని అక్కడే ఉంచి డ్రైవర్‌ పరారయ్యాడు. లారీ క్లీనర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు
సోమవారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా చేరుకొని ఆవేదనకు లోనయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వారంతా మృతి చెందడంతో వారి బంధుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.
ప్రమాదానికి గుంతలే కారణం
ఈ ప్రమాదానికి ప్రధాన కారణం జాతీయ రహదారిపై అధికంగా గుంతలు ఏర్పడడమే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డు మట్టి మీద వేయడంతో లారీ డ్రైవర్‌ తన వాహనాన్ని గుంతలలో పడకుండా తప్పించబోయి ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢకొీట్టాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌పి, ఆర్‌డిఒ
సంఘటన జరిగిన ప్రాంతం హైవే కావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా కొం డాపురం సిఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ సత్యనారాయణలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి ఎస్‌పి అన్బురాజన్‌, జమ్మల మడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు, డిఎస్‌పి నాగరాజు, కొండాపురం తహశీల్దార్‌ శోభన్‌బాబు తమ సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీ క్షించారు. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బంధువుల నుంచి మృతుల వివరాలను సేకరించి అనంతరం పోలీసులు అంబులెన్స్‌ వాహనాల్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద మృతులు
1. కాటసాని సుభద్ర (38) (కంప్లీకొట్టాలు, బళ్లారి),
2. కాటసాని లిఖిత్‌ కుమార్‌రెడ్డి(11) (కంప్లీకొట్టాలు, బళ్లారి),
3. కంచెంరెడ్డి సునీల్‌ కుమార్‌రెడ్డి (27) (నేదరపేట, కొండాపురం),
4. ఎస్‌.లక్ష్మీదేవి(38) (కంప్లీకొట్టాలు, బళ్లారి),
5. ఎం.సుమలత (38) (మైలవరం)
6. కొంచెంరెడ్డి వెంకటలక్ష్మి(55) (కృష్ణాపురం, తాడిపత్రి)
7. భూమిరెడ్డి సుధాకర్‌రెడ్డి (38) (డ్రైవర్‌, అబకంపల్లె, లింగాల)