Aug 28,2023 22:56

ఛాంపియన్‌షిప్‌ సాధించినవిద్యార్థులు


ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్ట్‌ 29) సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని దాసరి కామేశ్వరరావు మెమోరియల్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను విజయవాడ సమీపంలోని విజయవాడ రూరల్‌లోని నున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. టోర్నీలో 120 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. దాసరి కామేశ్వరరావు స్మారక ఓపెన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడ రూరల్‌ మండలం నున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 16 బంగారు, 17 రజత పతకాలను సాధించి విజేతగా నిలిచింది. వీరిలో అత్యధిక పతకాలు అండర్‌-14 కేటగిరీ రెజ్లర్లే సాధించారు. అదేవిధంగా 9 బంగారు, 2 రజతాలతో ఉంగుటూరు (గన్నవరం) జడ్పీహెచ్‌ ద్వితీయ స్థానం, విజయవాడలోని కొత్తపేటలోని ఎస్‌కెపివివి హిందూ ఉన్నత పాఠశాల 8 బంగారు, 8 వెండి పతకాలతో తతీయ స్థానంలో నిలిచాయి.
టోర్నీ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌ జిల్లా చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఏ అజీజ్‌, నున్న హైస్కూల్‌ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి, దాత నరెడ్ల సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డి మేజర్‌ ధ్యాన్‌చంద్‌, దాసరి కామేశ్వరరావులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ జిల్లా చీఫ్‌ కోచ్‌ అజీజ్‌ మాట్లాడుతూ.. 2వ ప్రపంచయుద్ధానికి ముందు సంవత్సరాల్లో భారత హాకీ జట్టు స్టార్‌గా నిలిచిందని.. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా మూడు స్వర్ణాలు సాధించడంలో ధ్యాన్‌చంద్‌ కీలకపాత్ర పోషించారన్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత, టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎన్‌టిఆర్‌ జిల్లాలో క్రీడాప్రతిభా అవార్డుగా పేరొందిన ఎస్‌కెపివివి హిందూ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ మద్దినేని వెంకట సత్య ప్రసాద్‌ను చీఫ్‌ కోచ్‌ అజీజ్‌ సన్మానించారు. అలాగే కష్ణాజిల్లాలో అవార్డు సాధించిన ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేసిన టి.శ్రీలతను సత్కరించారు. అనంతరం రెజ్లింగ్‌ పోటీలలో విజేతలు, రన్నరప్‌లుగా నిలిచిన క్రీడాకారులకు ఎస్‌ఎ అజీజ్‌, పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధి నరెడ్ల సత్యనారాయణరెడ్డి, క్రీడా ప్రతిభా అవార్డు గ్రహీత ఎంవిఎస్‌ ప్రసాద్‌ తదితరులు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నున్న హైస్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు విజయవర్మ, టి.శ్రీలత, ఉంగుటూరు హైస్కూల్‌ క్రాంతి కిరణ్‌, కోచ్‌లు సాయి భార్గవ్‌ గణేష్‌, కిరణ్మయి పాల్గొన్నారు.