Jan 30,2023 21:44

నిర్మాణంలో ఉన్న డ్రయినేజీ, రోడ్డు

ప్రజాశక్తి - పరిగి : అభివద్ధి పేరుతో చేస్తున్న రహదారి పనులు కొందరికి మాత్రమే అనుకూలించే విధంగా ఉన్నాయని పలువురు బాధితులు ఆరోపించారు. పరిగి మండల కేంద్రంలో వేస్తున్న రహదారి పనుల్లో భాగంగా కొన్ని ప్రదేశాలలో నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లను సైతం పూర్తిగా నేలమట్టం చేసి పలుకుబడి ఉన్న వ్యక్తుల స్థలాలలో ఉన్న నిర్మాణాల్లో అలానే ఉంచుతున్నారని వారు విమర్శించారు. ఎస్‌ఆర్‌సికాంట్రాక్టర్లు కొందరికి మాత్రంగా అనుకూలంగా పనులు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అభివృద్ది జరుగుతుందంటే చిల్లి గవ్వ కూడా కాంట్రాక్టర్ల నుండి తీసుకోకుండా లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగించుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చి బాడుగ ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. అయితే తమకో న్యాయం మరొకరికి ఒక న్యాయంగా కాంట్రాక్టర్లు వ్యవహరించడం సరికాదన్నారు. కోట్ల రూపాయలతో ప్రభుత్వం డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేస్తుంటే ఈ కాంట్రాక్టర్లు పలుకుబడి ఉన్న కొంతమందితో కొంత మొత్తంలో డబ్బులు తీసుకొని వారికి అనుకూలంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనితీరు వల్ల బాధితులంతా ఏకమై పనులు నిలిపివేయించి తమకు న్యాయం జరిగే వరకూ రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మండల అధికారులు సైతం తమకేం తెలియదన్నట్టు వ్యవహరించడం సరికాదన్నారు. తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.