Feb 13,2022 07:46
  • ప్రజారోగ్యశాఖకు ఫిర్యాదుల వెల్లువ
  • చర్యలు తప్పవంటున్న అధికారులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డాక్టర్‌ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో నకిలీ సర్టిఫికెట్లు భాగోతం బహిర్గతమైంది. మూడు వేలకుపైగా వచ్చిన అర్జీల్లో చాలా మంది నకిలీ సర్వీసు సర్టిఫికెట్లతో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసినట్లు తెలిసింది. డాక్టర్‌ పోస్టుల భర్తీలో కోవిడ్‌-19 సేవలందించిన వారికి వెయిటేజీ మార్కులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, కొందరు కోవిడ్‌ నకిలీ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం. వైద్యారోగ్యశాఖ రెండు దశల్లో 264 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ (సిఎఎస్‌) పోస్టుల భర్తీకి మూడు రోజుల క్రితం 3,013 మందితో తుది మెరిట్‌ జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు నకిలీ కోవిడ్‌ సర్వీస్‌ సర్టిఫికెట్లను పెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. సిఎఎస్‌ పోస్టుల భర్తీలో ఎంబిబిఎస్‌ మార్కులతోపాటు ఇంటర్న్‌షిప్‌, సర్వీసుకు వెయిటేజీ మార్కులు ఇచ్చారు. ఎంబిబిఎస్‌ మార్కులను 75 శాతంగా పరిగణించగా, ఇంటర్న్‌షిప్‌కు గరిష్టంగా 10 శాతం (సంవత్సరానికి ఒక మార్కు), సర్వీసుకు 15 శాతం వెయిటేజీ మార్కులను కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసులో గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే 2.5 శాతం, గ్రామాల్లో రెండు శాతం, పట్టణ ప్రాంతాల్లో ఒకశాతం వెయిటేజీ ఇవ్వగా, కోవిడ్‌ కాలంలో సేవలందించినందుకు ఆరు నెలలకు ఐదు మార్కులను ఇచ్చారు. కోవిడ్‌కు ముందే కొంతమంది డాక్టర్లు వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. కొందరు కోవిడ్‌ సేవలూ అందించినట్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ సమయంలో సేవలందించిన డాక్టర్ల వివరాలు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంటులకు ప్రజారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిఎఎస్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కోవిడ్‌ నాటికి ఏం చేస్తున్నారో వివరాలను కూడా తెలపాలని సూచించింది.
 

                                                ఫేక్‌ అని తేలితే చర్యలు : డాక్టర్‌ హైమావతి

సర్వీసు వెయిటేజీ మార్కుల కోసం సిఎఎస్‌ దరఖాస్తుల్లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లలో ఫేక్‌వి ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినమాట వాస్తవమేనని ప్రజారోగ్యశాఖ డైరెక్టరు డాక్టర్‌ జి హైమావతి 'ప్రజాశక్తి'కి తెలిపారు. అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లు ఫేక్‌ అని తేలితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. తుది మెరిట్‌ జాబితాపై శాఖాపరంగా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.