ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
ప్రఖ్యాత దంత వైద్య నిపుణులు డాక్టర్ భావన్‌చంద్ యేమినేనికి అమెరికా కేంద్రంగా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్స్ (ఐసీవోఐ) ఫెలోషిప్ లభించింది. డెంటల్ ఇంప్లాంటాలజీ, దంత వైద్య పరిశోధనలు, డెంటల్ ఇంప్లాంటాలజీ సంబంధిత అధ్యయనాలకు సంబంధించి ఐసీవోఐ ఫెలోషిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. అత్యంత విశిష్టమైన ఈ ఫెలోషిప్ పొందిన ఓరల్ ఇంప్లాంటాలజిస్టులను ఎఫ్‌ఐసీవోఐ హోదాతో గౌరవిస్తారు. దంత మార్పిడి నిపుణులుగా విశేష ఖ్యాతి గడించిన డాక్టర్ భావన్ చంద్ యేమినేని.. మీనాక్షి అమ్మళ్ డెంటల్ కాలేజీ నుంచి 2013లో ఎండీఎస్ పట్టా అందుకున్నారు. 2021లో చెన్నై మీనాక్షి యూనివర్సిటీ నుంచి డెంటల్ ఇంప్లాంటాలజీ విభాగంలో పీహెచ్‌డి డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాల్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ భావన్ చంద్... విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో మనీషా డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఇంప్లాంటాలజిస్ట్, ప్రోస్తోడాంటిస్టుగా సేవలందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీవోఐ ఫెలోషిప్ అందుకోవడం పట్ల డాక్టర్ భావన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ అత్యాధునిక దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.










