ముదినేపల్లిలో అడుగంటుతున్న మంచినీటి చెరువులు
పసర్ల నీటితో ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - ముదినేపల్లి
ఎండలు మండిపోవడంతో మండలంలో జనం గొంతెండుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్యుడు ఈ వేసవిలో తన ప్రతాపాన్ని చూపడంతో మంచినీటి చెరువుల్లో నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. నీటిమట్టాలు తగ్గడంతో చెరువుల్లో నీరు వాసన వస్తూ, పసర్లుగా మారుతున్నాయి. పలు గ్రామాల్లో మూడు నుంచి ఐదు అడుగుల మేర నీటిమట్టాలు పడిపోయాయి. మండలంలో సగానికి పైగా చెరువుల్లో నీరు అడుగంటడంతో మండల ప్రజలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదిలేక మినరల్ నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 63,345 జనాభా ఉన్నారు. మండలవ్యాప్తంగా 34 రక్షిత మంచినీటి పథకాలు ఉండగా, వీటికి అనుబంధంగా 41 మంచినీటి చెరువులు ఉన్నాయి. అయినా మండలంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. భనుడి భగభగలకు చెరువుల్లో నీరు అవిరైపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏప్రిల్ 30 వరకు పంట కాలువల ద్వారా మంచినీటి చెరువులకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరిగినప్పటికీ ఎండలకు నెలరోజుల్లో మంచినీటి చెరువుల్లో నీటిమట్టాలు పడిపోయాయి. గతంలో మండల శివారు గ్రామాల్లో నీటి సమస్యలు ఉన్న గ్రామాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం అదీ ఎక్కడ జరగడం లేదు. దీంతో ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు.
నీటి కోసం తిప్పలు
మండలంలో ఆక్వా సాగు విస్తరించిన కారణంగా గ్రామాల్లో మంచినీటి చెరువులు, మంచినీటి బావులు కలుషితమయ్యాయి. దీంతో తాగేందుకు మంచినీరు దొరకక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో మండలంలో అనేక గ్రామాల్లో నీటి సమస్యలు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు దూరంగా ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. దూరం వెళ్లలేని మరికొందరు గ్రామాల్లోకి వ్యాన్ల ద్వారా విక్రయించే నీటిని కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని దేవరం, పేరూరు, దాకరం, చినపాలపర్రు, అత్తి మానుచెరువు, నాయు డుచెరువు, పలు గ్రామాల ప్రజలు ఐదారు కిలోమీటర్లు సైకిళ్లు, ద్విచక్రవాహనాలపై ముదినేపల్లి వెళ్లి నీటిని తీసుకువెళ్తున్నారు.
స్కీమ్‌లు ఉన్నా....
మండలంలోని 34 మంచినీటి స్కీమ్‌లు ఉన్నా, ఆ నీరు ప్రజలు తాగేందుకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. పంచాయతీలు కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు కేవలం ఇళ్లల్లో వాడుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్ప తాగేందుకు పనికిరావు. నిధుల కొరతతో పంచాయతీలు స్కీమ్‌ల నిర్వహణ గాలికొదిలేశాయి. పలు గ్రామాల్లో ట్యాంకుల్లో కనీసం బ్లీచింగ్ కూడా కలపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్కీమ్‌ల ఫిల్టర్‌బ్లెడ్స్ పాడైపోవడంతో నీటిని శుద్ధి చేయకుండా చెరువులో నుంచి సరాసరి ట్యాంకులోకి ఎక్కించి కుళాయిలకు వదులుతున్నారు. ఆ నీరు వాసన రావడంతో పాటు పసర్లుగా ఉండడంతో పలు గ్రామాల్లో ప్రజలు తాగేందుకు కాదు కదా, కనీసం ఆనీటిని వాడుకునేందుకు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరో 20 రోజుల వరకు పంటకాలువకు నీరు విడుదల చేసే పరిస్థితి కనబడడంలేదు. ఇప్పుడే మండలంలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అప్పటివరకు నీటి కష్టాలు తమకు తప్పేటట్లు లేవంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి
మండలంలో మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలంటూ ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని దేవరం, చేవూరు, కోమర్రు, ఐనంపూడి, పేరూరు, దాకరం, చినపాలపర్రు, నాయుడుచెరువు, అత్తిమానుచెరువు, తేరగూడెం, రాఘువపురం, ఉప్పరగూ డెం గ్రామాలతో పాటు నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు అధికా రులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తమ దాహార్తిని తీర్చాలంటూ ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నీటి సమస్య లేదు
ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ వి.వెంకటకృష్ణ
మండలంలో నీటి సమస్య లేదు. ఈ సారి ఏప్రిల్ 30 వరకు మంచినీటి చెరువులకు నీరు సరఫరా చేశాం. కార్యదర్శులు చెరువుల్లో నీటిని పూర్తిస్థాయిలో నింపారు. జూన్ 20 లోపు కాలువకు నీటిని వదిలే అవకాశం ఉంది. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.










