- కర్నూలు జిల్లాలో మొదలైన నీటి ఎద్దడి
- అందని నిధులు.. అల్లాడుతున్న ప్రజలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : పల్లె, పట్టణం తేడా లేదు.. వేసవి వస్తుందంటే చాలు తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. తెల్లవారింది మొదలు గుక్కెడు నీటి కోసం సుదూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారుల ముందస్తు ప్రణాళికా లోపంతో ప్రజల గొంతెండుతోంది. కర్నూలు జిల్లాలో దాదాపు 80 గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని ట్యాంకుకు బాపురం స్కీం నుంచి మంచినీటిని విడుదల చేస్తారు. వేసవి ఆరంభమవ్వడంతో ప్రస్తుతం పదిరోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. నీరు వచ్చినప్పుడు గ్రామంలోని వారు ఒకేసారి ఇరవై బిందెల్లో నీటిని నింపుకుంటారు. ట్యాంకు నుంచి బిందెలను ఇంటికి తీసుకుపోవడానికి ప్రత్యేకంగా ఒక ట్రాలీని సైతం తయారు చేసుకున్నారు. ఇందుకోసం ఒక్కొక్క కుటుంబం రూ. వెయ్యిరూపాయలు ఖర్చుచేశారు. బిందెల్లో నింపుకున్న నీరు అయిపోతే గ్రామంలోని వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ఎప్పుడు నీరొస్తాయా? రావో? తెలియక అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఐనకల్లు గ్రామంలోని నీటి ట్యాంకు నిరుపయోగంగా మారడంతో సమీపంలోని నీటి పథకం వద్దకు గ్రామస్తులు బారులు తీరుతున్నారు. కరెంటు ఉన్నప్పుడు మాత్రం చిన్నధారలా నీరు వస్తుండటంతో తమ వంతు వచ్చే వరకూ పడిగాపులు కాస్తున్నారు. ఆస్పరి, కోసగి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆదోని మండలంలోని నవలకల్ వాటర్ స్కీం నుంచి 14 గ్రామాలకు నీటిని విడుదల చేస్తుండగా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. సి.బెళగల్ మండలం కృష్ణదొడ్డిలో నీటి పైప్‌లైన్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కుళాయిల ద్వారా నీరు పైకి రాక గిన్నెల ద్వారా కిందనే నీరు పట్టుకొని బిందెలను నింపుకుంటున్నారు.
నిధులు లేవు..నీరు రాదు..
కర్నూలు జిల్లాలో 57 సిపిడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 682 గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతోంది. వీటి నిర్వహణకు ఏటా రూ.60 కోట్లు కేటాయిస్తారు. గత 18 నెలలుగా వాటి నిర్వహణకు నిధులు అందడం లేదు. ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్ల వరకూ బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు కొన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉండగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2019-20కు సంబంధించి రూ.2.54 కోట్లు, 2021-22కు సంబంధించి రూ.3లక్షల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 9,935 చేతి పంపులు, 3,599 మంచి నీటి పథకాలు ఉన్నాయి. వాటి నిర్వహణకు నిధులు అందలేదు. గతేడాదికి సంబంధించి రూ.2.45 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి.
పురపాలికల్లోనూ నీటి తిప్పలే
కర్నూలు జిల్లాలోని పురపాలికల్లోనూ నీటి కోసం తిప్పలు తప్పడం లేదు. ఆదోనిలో మూడ్రోజులకు ఒకసారి, డోన్, ఎమ్మిగనూరులో రెండు రోజులకు ఒకసారి నీరు వదులుతున్నారు. నీటి పథకాల నిర్వహణ కోసం ఆదోనిలో రూ.1.28 కోట్లు, డోన్‌లో రూ.50లక్షలు, ఎమ్మిగనూరులో రూ.1.10 కోట్లు, ఆత్మకూరులో రూ.54.50 లక్షలు అవసరం ఉన్నట్లు అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు.

కరెంట్ పోతే నీళ్లుండవు
తాగడానికి, వాడుకోవడానికి ఒకే బోరు. ఆ బోరు నీటి కోసం గంటలు తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంట్ పోతే అసలు తాగడానికి నీరు ఉండవు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
- బి మహేశ్వరి,
ఐనేకలు, ఆస్పరి మండలం

అధికారుల నిర్లక్ష్యం
గ్రామానికి తాగు నీరు సక్రమంగా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పుంపు, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు శుభ్రం చేయకుండా నీరు సరఫరా చేస్తున్నారు. 10 నుండి 15 రోజులకోసారి తాగు నీరు అందిస్తున్నారు.
- నారాయణ,
మనేకుర్తి, ఆలూరు మండలం.










