- కేంద్రం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దారిమళ్ళించరాదు
ప్రజస్సక్తి-విజయవాడ : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీలకు కేటాయిస్తోన్న ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించిన పాపం రాష్ట్ర ప్రభుత్వానిదని, దీనికి పంచాయతీలను శిక్షించడం అన్యాయమని, తక్షణం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కువ పంచాయతీల్లో ఏకంగా 80 నుంచి 90శాతం నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు జగన్ ప్రభుత్వం జమ చేసుకుందని తెలిపింది. దీనిపై వివరణ ఇచ్చే వరకు తదుపరి నిధులు విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పటం దుర్మార్గమని ఆగ్రహించింది. ఇప్పటికే అనేక గ్రామపంచాయతీలలో వర్షాకాలం సమయంలో బ్లీచింగ్ కొట్టించలేకపోతున్నాయని, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామపంచాయతీలో గ్రీన్ గార్డ్, గ్రీన్ అంబాసిడర్ పేరుతో తీసుకున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు ఇస్తామని చెప్పి, ఒక సంవత్సరం మాత్రమే ఇచ్చి బాధ్యతారాహిత్యంగా చేతులు దులుపుకుందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మికులకు ప్రతి నెలా వారే జీతాలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
15వ ఆర్థిక సంఘం (రెండవ క్వార్టర్ )నిధులు కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు క్రితమే విడుదల చేయవలసి ఉందని పేర్కొంది. ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి గ్రామ పంచాయతీలకు జమ చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది.










