Oct 09,2023 11:34
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  • ఈనెల 19న ప్రజాప్రణాళిక విడుదల
  • పార్వతీపురం, మందస, ఆదోని నుండి మూడు జాతాలు ప్రారంభం
  • ఆదివాసుల భూములు లాగేసుకుంటున్న ప్రభుత్వాలు
  • దెబ్బతింటున్న కార్మికులు, రైతులు, రాయలసీమలో కరువు ప్రమాదం
  • కృష్ణాజలాల విషయంలో దాసోహం అంటున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన నవంబరు 7న విజయవాడలో ప్రజా రక్షణ భేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఎంబివికెలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, డి.రమాదేవితో కలిసి ఆయన రక్షణ భేరి లోగో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూఈ నెల 19వ తేదీన ప్రజాప్రణాళిక విడుదల చేయనున్నామని తెలిపారు. అలాగే ప్రజారక్షణ భేరికి ముందు రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి జాతాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మొదటి జాతా అక్టోబరు 21న పార్వతీపురం జిల్లా సీతంపేట నుండి, మరో జాతా అక్టోబరు 22వ తేదీన కర్నూలు జిల్లా ఆదోనీ నుండి, అక్టోబరు 26న శ్రీకాకుళం జిల్లా మందస నుండి మూడవ జాతా ప్రారంభమవుతాయని తెలిపారు. సీతంపేటలో బయలుదేరే యాత్ర పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, అరకువ్యాలీ, రంపచోడవరం, పోలవరం, ఏలూరు మీదుగా నవంబరు 1వ తేదీన విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. మందస నుండి బయలుదేరే జాతా టెక్కలి, విజయగనరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, భీమవరం, మచిలీపట్నం మీదుగా నవంబరు 3న విజయవాడ వస్తుందని తెలిపారు. ఆదోనీలో బయలుదేరే జాతా కర్నూలు, నంధ్యాల, కడప, గుత్తి, అనంతపురం, హిందూపురం, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, నరసరావుపేట, పర్చూలు, గుంటూరు మీదుగా నవంబరు 2వ తేదీన విజయవాడకు వస్తుందని పేర్కొన్నారు. జాతాలు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, ప్రజలపైరాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ డిమాండ్లపై దారిపొడవునా ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు లౌకిక ప్రజాస్వామ్యశక్తులను కూడగడుతుందని తెలిపారు. ముగింపుగా విజయవాడలో జరిగే సభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ వేర్వేరు అంశాలపై సిపిఎం ఆధ్వర్యాన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదానీతో చర్చలు బహిర్గతం చేయండి

స్పెషల్‌ డిఎస్‌సి లేదని, విద్యావాలంటీర్ల పరిస్థితి గాల్లో దీపంలా ఉందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములను మోడీ, అదానీ, జగన్‌త్రయం లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిశారని, కానీ ఒప్పందాలు ఏమిటో ఇంతవరకు ప్రజలకు బహిర్గతం చేయడం లేదని తెలిపారు. దేశాన్నీ లూటీ చేసి ప్రపంచ కుబేరుడుగా మారిన అదానీతో చర్చల వివరాలు వెల్లడించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. రహస్యం ఎందుకు ? దాపరికం ఏమిటని ప్రశ్నించారు. పంప్డ్‌ స్టోరేజ్‌ పేరుతో భూములు, ఖరీదైన మైనింగ్‌, బీచ్‌శాండ్‌ ఖనిజాలను కూడా అదానీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం సహించరాని విషయమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులను పరిరక్షించడం ధ్యేయంగా సిపిఎం యాత్ర చేస్తోందని తెలిపారు. గోదావరి కింద సరిగా నీరు ఇవ్వడం లేదని, వర్షాలు లేవని, ఉత్పత్తి దెబ్బతింటోందని, పనులు లేవని, కార్మికులకు కనీస చట్టాలు అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వాల తీరుతో ఆయా ప్రాంతాల్లో కార్మికులు, రైతులు దెబ్బతినిపోతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృపమ్మ అనే ఆశా వర్కర్‌ అధికారుల వేధింపులు, తీవ్ర పని ఒత్తిడితో చనిపోయిందని తెలిపారు. వారికి నెలకు రూ.10 వేల జీతం ఇస్తున్నారని, వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. అడిగితే యూనియన్‌ నాయకులను అరెస్టు చేసి వేధిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగులు చనిపోతే రూ.25 లక్షలు ఇస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కనీసం రూ.21 వేల జీతం ఉండాలని తెలిపారు. వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు. విశాఖజిల్లా అచ్యుతాపురం, పరవాడలో గార్మెంట్‌ రంగంలో మహిళలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. వారికి సంక్షేమ చట్టాలు ఏమీ అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వాలకు మహిళల ఉసురు తగులుతుందని అన్నారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్థాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

cpm-press-meet-on-praja-rakshna-bheri-logo

సీమకు కరువు ప్రమాదం

రాయలసీమలో కరువు ప్రమాదం ఉందని తెలిపారు. కృష్ణాజలాలను పున: పంపిణీ సమీక్ష చేయాలనే కేంద్రం నిర్ణయంతో ఈ ప్రాంతానికి అసలు నీరే అందని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, జిఎన్‌ఎస్‌ఎస్‌, కెసి కెనాల్‌కు నీరు అందదని తెలిపారు. అప్పర్‌ భద్ర కడుతుంటే రాష్ట్రం కనీసం ప్రశ్నించడం లేదని, దీనివల్ల రాయలసీమ ప్రాంతం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కోల్పోయామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు లక్షకోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. బిజెపి రాష్ట్రానికి పదేపదే ద్రోహం చేస్తోందని, అయినా ప్రభుత్వం ప్రశ్నించడం లేదనితెలిపారు. కృష్ణాజలాల విషయంలో రెండు రాష్ట్రాలు సమీక్షించాలని కోరితే చేయాలని కానీ తెలంగాణాలో ఎన్నికల లబ్దికోసం పున:సమీక్ష చేయాలని నిర్ణయించడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని తెలిపారు. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై కోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. బిజెపి రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తుంటే ముఖ్యమంత్రి నోరెత్తడం లేదని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఆపని చేయడం లేదని అన్నారు. నదీ జలాలు పున:పంపిణీ జరిగితే పెండింగ్‌ ప్రాజెక్టులకు, రాయలసీమకు, కృష్ణాడెల్టాకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాయకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న కపట నాటకాలవల్ల రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గఫూర్‌ మాట్లాడుతూ బిజెపి అన్యాయం చేస్తున్నా ప్రభుత్వంగానీ, తెలుగుదేశం, జనసేన మాట్లాడటం లేదని అన్నారు. ప్రత్యేక హౌదా, రైల్వే, రాజధాని, కడపస్టీలుప్లాంటు, వెనుకబడిన ప్రాంతాల విషయం బిజెపి స్పందించకపోయినా ప్రధాన పార్టీలు దానికాళ్ల చుట్టూ తిరుగుతున్నాయని తెలిపారు. కర్నాటకలో ఎగువతుంగకు నిధులు ఇచ్చారని, తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయని కృష్ణాజలాల అంశాన్ని ముందుకు తెచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అధికారపార్టీగానీ, ప్రధాన ప్రతిపక్షాలుగానీ ప్రశ్నించకపోవడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని అన్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వలసలు పోతున్నారని, రాయలసీమలోతాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ముంచుకు వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్య పరిచేందుకు సిపిఎం కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ఫ్రభుత్వం మద్య నిషేధంపై వెనక్కు వెళ్లడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు టార్గెట్లు పెంచుతున్నారని తెలిపారు. గతేడాది 22 వేల కోట్ల అదాయం వస్తే ఈ ఏడాది 25 వేల కోట్ల అదాయాన్ని పెంచుకుంటునేలా టార్గెట్‌ పెట్టుకున్నారని తెలిపారు. కేంద్రం ప్రకటించిన మహిళా రిజర్వేషన్‌ అమలు జరగడం ఇష్టంలేకే వెంటనే అమలు చేయకుండా 2029 ఎన్నికల తరువాత తీసుకొచ్చేలా నిర్ణయం చేశారని తెలిపారు. మహిళలపై దాడులు, దూషణలు, వ్యక్తిత్వ హననం జరుగుతున్నాయని తెలిపారు. అధికార పార్టీ నాయకుల విషయంలో ఒకవిధంగా, ఇతర పార్టీల నాయకుల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. అక్క చెల్లెళ్లకు న్యాయం చేస్తున్నామని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. మహిళల హక్కులపై అధ్యయనానికి ఒక కమిటీ వేయాలని అన్నారు.