ఇకె నయనార్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : సుదీర్ఘకాలం ప్రజాజీవితం గడిపి, పార్టీలో కేంద్రకమిటీ, పోలిట్‌బ్యూరో స్థాయిలో సేవలందించి.. వయోభారం, ఇతర కారణాలతో రిలీవ్ అయిన సీనియర్ నాయకులకు మహాసభ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మహాసభలో ఉద్విగ వాతావరణం నెలకొంది. రెడ్‌సెల్యూట్ నినాదాలతో మార్మోగింది. ఎస్.రామచంద్రన్ పిళ్ళై, బిమన్ బసు, హన్నన్ మొల్లాలను సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి ఎర్ర శాలువాలు కప్పి సత్కరించారు. భవిష్యత్‌లోనూ వారి సేవలు అందుబాటులో ఉండగలవన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బాధ్యతలు నిర్వహించిన పి.మధు, ఎస్.వీరయ్య ఈ మహాసభలో రిలీవ్ అయ్యారు.
- అరుణ పతాకతో అనుబంధం
ఆదివారం జరిగిన సిపిఎం బహిరంగ సభకు అన్ని వయసుల వారూ, అన్ని తరగతుల వారూ అత్యంత ఉత్సాహంగా తరలివచ్చారు. పిల్లాపాపలను వెంట బెట్టుకొని వచ్చిన సామాన్య కార్మిక కుటుంబీకులూ; మూడు తరాలకు ప్రాతినిథ్యం వహించే అమ్మ, అమ్మమ్మ, కుమార్తెలూ ఈ సభా ప్రాంగణంలో కనిపించారు.










