CPM Congress : హిందూత్వ - కార్పొరేట్ విధానాలపై రాజీలేని పోరు
- బిజెపిని ఒంటరిపాటు చేయటం.. ఓడించటం అత్యంత అవసరం
- ప్రాంతీయ పార్టీలు ఊగిసలాట ధోరణి విడనాడాలి
- ప్రత్యామ్నాయ కార్యక్రమం ద్వారానే పాలక వర్గాల విధానాలకు అడ్డుకట్ట
- సిపిఎం 23వ అఖిల భారత మహాసభ ప్రారంభోపన్యాసంలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- రాజ్యాంగ పరిరక్షణోద్యమంలో కలిసి రావాలంటూ దేశభక్తులకు పిలుపు
ఇకె నయనార్ నగర్ (కన్నూరు)నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో లౌకికత్వ పరిరక్షణ కోసం ఉధృతంగా.. రాజీలేని పోరాటాలు చేయటం ద్వారానే హిందూ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆ పోరాటాలకు సిపిఎం, వామపక్షాలు నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నాయకత్వంతో కూడిన అలాంటి పోరాటాలే మతోన్మాదానికి నిజమైన విరుగుడని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపిని ఒంటరిపాటు చేయటం, దాన్ని ఓడించటమనేవి ఇప్పుడు దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. ఎన్నికల ద్వారానే ఆ పార్టీని ఓడించటమనేది కాకుండా రాజకీయ సైద్ధాంతికతతోపాటు సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకోసం వామపక్షాలు, సిపిఎం తమ బలాన్ని పెంచుకొని పీడిత ప్రజల కోసం పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ లౌకికత్వాన్ని రక్షించటంలో తామెలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాయో, ఎటువైపు నిలబడుతున్నాయో పరిశీలించుకోవాలని హితవు పలికారు.
సిపిఎం అఖిల భారత 23వ మహాసభ బుధవారం కేరళలోని ఇకె నయనార్ నగర్ (కన్నూరు)లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కారు అధ్యక్షతన ఆరంభమైంది. ఈ సందర్భంగా ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తూ, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర భారతాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దీంతోపాటు శ్రామికవర్గ హక్కులనూ పరిరక్షించాలని సూచించారు. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరెస్సెస్ ఆదేశాలకు అనుగుణంగా మరింత దూకుడుగా హిందూత్వ అజెండాను అమలు చేస్తోందని తెలిపారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలను గతం కన్నా రెట్టింపు వేగంతో అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం, కార్పొరేట్ విధానాలను ఒక గొలుసులాగా కలిపి అమలు చేస్తోందని అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ప్రభుత్వరంగ సంస్థలను యథేచ్ఛగా అమ్ముతున్నదని తెలిపారు. అదే సమయంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ... దానికి పునాదులైన లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే మౌలికాంశాలకు తూట్లు పొడుస్తున్నదని హెచ్చరించారు. రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ తదితరాలకు ఉన్న స్వతంత్రను భంగపరుస్తూ వాటిని తన అధీనంలోకి తెచ్చుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
- 'పెట్రో' పెంపు.. పెరిగిన దరిద్రం, నిరుద్యోగం...
మరోవైపు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజానీకంపై ఆర్థిక భారాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఏచూరి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం... ఇప్పటివరకూ 14 సార్లు పెట్రో ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కోవిడ్ కంటే ముందే దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైందనీ, కరోనా సమయంలో అది మరింత తీవ్ర రూపం దాల్చిందని తెలిపారు. ఒకవైపు దారిద్య్రం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తుంటే మరో వైపు కార్పొరేట్లు, బడాబాబులు లక్షల కోట్ల సంపదను పోగేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ఇది మరింత నగంగా బయటపడిందన్నారు. ప్రజల గురించి పట్టించుకోని మోడీ సర్కార్... పెద్దలకు మాత్రం లక్షల కోట్ల మేర రాయితీలనిచ్చిందని వివరించారు.
- దేశానికి కేరళ మార్గదర్శం
ఈ నేపథ్యంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం.. మిగతా అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని ఏచూరి చెప్పారు. లౌకికత్వాన్ని కాపాడటంలో రాజీలేని పోరు, కుల, మతాలకతీతంగా సమానత్వాన్ని పెంపొందించటం, లింగ వివక్ష లేకుండా చూడటం ద్వారా ఆ రాష్ట్రం తన ప్రత్యేతకను చాటి చెప్పిందని వివరించారు. సరళీకృత ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఉపయోగపడే విధానాలతో ముందుకెళుతున్నదని చెప్పారు. ఫలితంగా మానవాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా నిలిచి ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుందని ప్రశంసించారు.
- వారిని స్మరించకుండా 'తీర్థ యాత్ర' పూర్తి కాదు...
సాధారణ ప్రజలు తీర్థ యాత్రలు చేస్తుంటారనీ, కానీ కమ్యూనిస్టులకు అవేవీ ఉండబోవని ఏచూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఒకవేళ వారు తీర్థయాత్రలు చేయాల్సి వస్తే... కేరళలోని కయ్యూరు, కరివెల్లూరు అమరవీరుల స్థలాలను సందర్శించకుండా, వారికి అంజలి ఘటించకుండా ఆ యాత్ర పూర్తి కాబోదని అన్నారు. పార్టీ 23వ మహాసభను ఇక్కడ నిర్వహించుకోవటం ఆనందదాయకంగా ఉందని చెప్పారు. కేరళ కమ్యూనిస్టు యోధులు పి.కృష్ణ పిళ్లై, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఎకె గోపాలన్ తదితరుల త్యాగాలను, వారు ప్రజలకు, పార్టీకి చేసిన సేవలను ఏచూరి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సౌహార్ద సందేశమివ్వటానికి విచ్చేసిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందాకరత్, రామచంద్రన్ పిళ్లై, పినరయి విజయన్, కొడియేరి బాలకృష్ణన్, సుభాషిణీ అలీ, బిమన్ బసు, బివి రాఘవులు, ఎమ్‌డీ సలీం, హన్నన్ మొల్లా, ఎమ్‌ఏ బేబి, కె.రామకృష్ణన్, నీలోత్పల్ బసు, తపన్‌సేన్, సూర్యకాంత్ మిశ్రా వేదికపై ఆశీనులయ్యారు.










