Oct 07,2023 07:55

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో డెవలపర్‌గా ఉన్న విశాఖ ఫార్మాసిటీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (రాంకీ) యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించినందున తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ నగరంలోని నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, అనకాపల్లి జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణతో కలిపి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీలో రాంకీ యాజమాన్యానికి 2100 ఎకరాల భూమిని వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కేటాయించారని తెలిపారు. వాటితో సదరు యాజమాన్యం కోట్లాది రూపాయలు ఆర్జించిందన్నారు. ఫార్మా సిటీలోని పరిశ్రమలు విడుదల చేస్తోన్న వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా సముద్రంలో వదిలిపెడుతున్నట్టు తెలిపారు. దీనివల్ల మత్స్య సంపద నాశనమవుతోందని, సమీప గ్రామాల్లోని చెరువుల్లోకి వ్యర్థ రసాయనాలను విడిచిపెట్టడం వల్ల వ్యవసాయంపై ప్రభావం పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పరవాడలోని పెద్ద చెరువుల్లో రసాయనాల కారణంగా చేపలు మృతి చెందిన ఘటనలను గుర్తు చేశారు. రాంకీ యాజమాన్యం తానాం గ్రామాన్ని ఆనుకొని చెరువు తవ్వి ఫార్మా వ్యర్థ రసాయనాలను అందులోకి విడిచిపెడుతోందని తెలిపారు. దీనిపై స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు, జిల్లా కలెక్టర్‌కు తాము ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ లేవన్నారు. న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ సహకారంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తాము ఫిర్యాదు చేయగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, రాంకీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు.
అయినప్పటికీ రాంకీ చర్యలు ఆగనందున సిపిఎం న్యాయ పోరాటానికి పూనుకుంటోందని తెలిపారు. బఫర్‌ జోన్‌, గ్రీన్‌ బెల్ట్‌ నిబంధనలను రాంకీ యాజమాన్యం తుంగలో తొక్కిందన్నారు. రాంకీ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారని తెలిపారు. తాడి గ్రామానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. తక్షణం సదరు సంస్థపై చర్యలు తీసుకోకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.