Oct 16,2023 12:13

ప్రజాశక్తి-విశాఖ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్న నేపధ్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి, శ్రామిక మహిళా కన్వీనర్‌  పి.మణిని ఈ రోజు ఉదయం నుండి పోలీస్‌లు అక్రమ గృహ నిర్భందం చేసారు. ఈ గృహనిర్భందాన్ని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి కార్మిక సంఘ నాయకులను, వామపక్ష పార్టీల కార్యకర్తలను అరెస్టులను చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్దితో కార్మిక సమస్యలను పరిష్కారించకుండా కార్మిక సంఘాలపైన, కార్మిక నాయకులపైన నిర్భందాలను ప్రయోగించడం, అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఇటువంటి చర్యలు వెంటనే విడనాడాలని సిఐటియు డిమాండ్‌ చేసింది.. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ది వున్న వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీంవర్కర్స్‌ అయిన అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజనం, విఓఎ వంటి వారికి కనీస వేతనం 26,000/`రూ॥లు చెల్లించి, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేసారు. 
 ముఖ్యమంత్రి కేంద్ర మోడీ ఆదేశాలతో కార్పొరేట్‌ కంపెనీలకు కోట్లాది రూపాయాలు లాభాలు చేకూరుస్తూ... కార్మికులపైన నిర్భందాలను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. కార్మికులపైన, కార్మిక సంఘాలపైన నిర్భందాలు ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచి వేయాలంటే అంతకంటే సిగ్గుచేటు మరిఒకటి లేదు. ముఖ్యమంత్రి  తన నివాసంను విశాఖకు మారుస్తామన్నారు. ఆయన విశాఖలో వున్నంత కాలం కార్మిక సంఘాల నాయకులను, వామపక్ష, ప్రతిపక్ష నాయకులను ఇలాగే గృహనిర్భందం చేస్తారా. ఇటువంటి నిర్భంధాలకు పాల్పడితే ప్రజలు, కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని, దీనికి ప్రభుత్వం తగిన ముల్యం చేల్లించుకోవలసి వుంటుందని తెలియజేశారు.