సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ హీరోకు, హీరోయిన్‌కు ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. తమ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆ డ్రీమ్ రోల్‌లో నటించాలి అనుకుంటారు. అయితే కృతి శెట్టికి కూడా అలాంటి ఓ డ్రీమ్ రోల్ ఉందట. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న కృతి.. ఆ పాత్ర చేయడానికి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి క్రేజే వేరు. తను నటించిన మొదటి సినిమా 'ఉప్పెన' విడుదల అవ్వకముందే బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ అవ్వక పలు సినిమాలను వదిలేసుకున్నారు కూడా. అయితే కృతి తన డ్రీమ్ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం కృతి.. రామ్ సరసన 'ది వారియర్' చిత్రంలో నటిస్తున్నారు.
అంతే కాకుండా సుధీర్‌తో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాల్లో కూడా కృతినే హీరోయిన్. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కృతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!
పూర్తి పేరు : కృతి శెట్టి
ఇతర పేర్లు : అద్వైత
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 21, 2003
పుటిన ప్రాంతం : ముంబై
నివాస ప్రాంతం : బెంగళూరు
చదువు : సైకాలజీలో మాస్టర్స్
తల్లిదండ్రులు : కృష్ణ శెట్టి, నీతి శెట్టి
హాబీస్ : ట్రావెలింగ్
కృతి శెట్టి భారతీయ చలనచిత్ర నటి. ఆమె తొలిసారిగా 2021 తెలుగు సినిమా 'ఉప్పెన' ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె తెలుగులో రెండో సినిమా నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరారు'లో, మూడో సినిమా నాగచైతన్య హీరోగా నటించిన 'బంగార్రాజు'లో నటించారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్ హీరోయిన్‌గా తెలుగుసినీ రంగంలో రికార్డు క్రియేట్ చేశారు. కృతి చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బారు, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్‌లో నటించారు. కృతి శెట్టి చదువు అనంతరం అప్పుడప్పుడే మోడలింగ్ మొదలుపెట్టిన ఆమెకు హిందీలో 2019లో హృతిక్‌రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది.
ఎవరైనా గట్టిగా, కఠినంగా మాట్లాడితే నచ్చదు..
లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న 'ది వారియర్' చిత్రంలో ఓ అల్లరి పిల్ల పాత్రలో కనిపించనున్నారు కృతి. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. అందుకోసమే కృతి ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత తమిళ ప్రాంక్ స్టార్స్ ఆషిక్, సారథిరన్.. కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. దీంతో కృతికి ఏం అర్థంకాక అక్కడే అలా ఆందోళనతో కూర్చుండిపోయారు. మధ్యలో సారథిరన్ ఆషిక్‌పై చేయి చేసుకోవడంతో తనలో కంగారు మరింత ఎక్కువయ్యింది. అయితే చివరిలో ఇదంతా ప్రాంక్ అన్నారు సారథిరన్, ఆషిక్. ప్రాంక్ అని చెప్పగానే నవ్వేసిన కృతి.. ఆ తర్వాత కంటతడి పెట్టుకున్నారు. తనకు ఎవరైనా గట్టిగా, కఠినంగా మాట్లాడితే నచ్చదని చెప్తూ ఏడ్చేశారు. ఇటీవల విడుదలయిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ఇదంతా ఉండడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు కృతి చాలా సెన్సిటివ్ అని అభిప్రాయపడుతున్నారు.
అది నా డ్రీమ్ రోల్..
ఏ పాత్ర చేసినా అందులో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించేస్తారు కృతి. అయితే తనకూ ఓ డ్రీమ్ రోల్ ఉందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృతి. 'నాకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. ఇప్పటివరకూ నేను చేసినవన్నీ వేటికవే భిన్నమైనవి. అంతేకాదు.. స్టోరీ కన్నా నా క్యారెక్టర్ కూడా ముఖ్యమే. అందుకే, నేను ఇంత త్వరగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగాను. నా దగ్గరకు వచ్చే కథల్లో గత చిత్రాలను పోలినవి ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో చేయనని చెప్పేస్తా. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే.. సవాలు విసిరే పాత్రలనే ఎంచుకోవాలి. అలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తున్నా. అంతేకాదు, నాకు రాకుమారి పాత్రలో నటించాలనుంది. అది నా డ్రీమ్ రోల్.. ఎప్పటికి తీరుతుందో చూడాలి'.. అంటూ తన కోరిక గురించి చెప్పుకొచ్చారు. మరి నిజంగా కృతి శెట్టి డ్రీమ్ రోల్ చేసే అవకాశం ఏ భాషలో వస్తుందో.
కంఫర్ట్ అనిపిస్తేనే..
ఇప్పటి వరకూ చేసిన ప్రతి సినిమాలోనూ అందం, అభినయంతో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌తోనూ ఆకట్టుకున్నారు కృతి. 'ఒక డైరెక్టర్ చెప్పే కథకి సంతకం పెట్టాలంటే ఫస్ట్ కొన్ని బౌండరీస్ పెట్టుకున్నా. డైరెక్టర్ చెప్పే కథ నచ్చితే ముఖ్యంగా నేను పెట్టే ఫస్ట్ కండీషన్ క్యాస్ట్యూమ్స్. క్యాస్ట్యూమ్స్ విషయంలో నాకు కంఫర్ట్‌గా అనిపిస్తేనే వేసుకుంటా. దానికి వాళ్లు ఓకే అంటే అప్పుడు సినిమాకు సైన్ చేస్తా. ఇక బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకోలేదు. అలాంటి క్యారెక్టర్స్ నాకు అన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి!' అంటూ కృతి చెప్పుకొచ్చారు.