న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఆయన తరుపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ నెల 3న విచారణ సందర్భంగా వర్చువల్ గా వాదనలను వినిపించిన సాల్వే...ఆ తర్వాత కోర్టు అనుమతి లేకుండానే ఆయన నిష్క్రమించారు. ఈ కేసులో సోమవారం తిరిగి విచారణ చేపట్టిన జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్ తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం...గత విచారణ సందర్భంగా సాల్వే అనుమతి తీసుకోకుండా నిష్క్రమించడాన్ని ప్రస్తావించింది. "గత విచారణ సమయంలో మీరు అనూహ్యంగా నిష్ర్కమించారు. వర్చువల్ గా హాజరైనా.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే నిష్క్రమించాలి. మీరు ఉన్నట్టుండి మాయమయ్యారు. నేను, జస్టిస్ బోస్ ఆశ్చర్యపోయాం " అని జస్టిస్ త్రివేది అన్నారు. దీంతో న్యాయవాది సాల్వే క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు తరఫున మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారని, అందుకే తాను నిష్క్రమించినట్లు తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా నిష్క్రమించినందుకు క్షమించాలని కోరారు.










