Sep 29,2023 10:54
  • సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాక
  • బహిరంగ సభ పోస్టర్‌ ఆవిష్కరణలో సిపిఎం నేతలు 

ప్రజాశక్తి-విశాఖ : స్టీల్‌ప్లాంట్‌ రక్షణకై అక్టోబర్‌ 5న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సి.హెచ్‌.నర్సింగరావు తెలిపారు. శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో ఉన్న నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నిర్వహించిన పత్రికా సమావేశంలో బహిరంగ సభ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సి.హెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణకై సిపిఎం గత 11 రోజుల నుండి వందలాది మందితో ఉత్తరాంధ్రలో బైక్‌యాత్ర జయప్రదంగా సాగుతున్నదని పేర్కొన్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా అక్టోబరు 5వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ (కూర్మన్నపాలెం జంక్షన్‌) వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్యవక్తగా సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని, ఈ సభకు కార్మికులు, ప్రజలు కుటుంబాలతో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు. 

  • బిజెపి ఎంపి జివిఎల్‌ హైడ్రామాలు ఆపాలి

బిజెపి నాయకులు జివిఎల్‌ నర్సింహరావు విశాఖస్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తామని ఇటీవల ప్రకటించారని సి.హెచ్‌.నర్సింగరావు తెలిపారు. ఇందులో వాస్తవమెంత....? విశాఖస్టీల్‌ప్లాంట్‌ను ముంచుతున్నది కేంద్ర బిజెపి ప్రభుత్వం కాదా? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతామని స్టీల్‌ మంత్రితో పార్లమెంట్‌లో ప్రకటించే ధైర్యం జివిఎల్‌కు వుందా? అని ఆయన ప్రశ్నించారు. 2020 జనవరి నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టేటజిక్‌సేల్‌ పేరుతో నూరుశాతం అమ్మాలని శతవిధాలా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అది సాధ్యంకాలేదు. స్టీల్‌ప్లాంట్‌ను విలువకట్టే కమిటీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వచ్చి విలువను అంచనా వేయలేకపోయాయని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పోరాటం వల్ల బిజెపి వెనక్కుతగ్గాల్సి వచ్చిందని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను బలహీనం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారని వెల్లడించారు. విశాఖస్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిని 40శాతం తగ్గించి రూ॥ 3900 కోట్లు గత సంవత్సరం నష్టాలు రావటానికి కేంద్ర బిజెపి ప్రభుత్వమే కారణమన్నారు. దేశంలో అన్ని స్టీల్‌ ప్లాంట్‌లకు లాభాలు వచ్చాయని, నాణ్యమైన స్టీల్‌ ఉత్పత్తిలో  అగ్రగామిగా ఉన్న విశాఖ స్టీల్‌కు ఎందుకు నష్టాలొచ్చాయని ప్రశ్నించారు. ముడిఖనిజం రాకుండా అదానీని అడ్డుపెట్టుకున్నారని, ఎన్‌ఎండిసి నుండి ముడిఖనిజం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, బ్లాస్ట్‌ఫర్నేస్‌ `3ను జిందాల్‌ స్టీల్‌కు అప్పగించడానికి నేడు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆగ్రహించారు. గతంలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ను బలహీనపర్చి రిలియన్స్‌కు అప్పగించిందని, విశాఖ స్టీల్‌ను జిందాల్‌, పోస్కో(దక్షిణకొరియా)లకు అప్పగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఇది పూర్వవైభవమా? అని బిజెపి నాయకులు జివిఎల్‌ను ప్రశ్నించారు.  
సిపిఎం ప్రభుత్వరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, దేశంలో గత 75ఏళ్ళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వరంగం సోవియట్‌ యూనియన్‌ మరియు ఇతర సోషలిస్టుదేశాల సహాయంతో ఎంతో అభివృద్ధిని సాధించాయని వివరించారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నేడు విశాఖ స్టీల్‌, రైల్వే, విద్యుత్‌, పెట్రోలియంలాంటి కీలకరంగాలతో సహా మొత్తం ప్రభుత్వరంగాన్ని అమ్మేస్తాం లేదా మూసేస్తామన్న విధానాన్ని ప్రకటించి అమలు చేస్తోందని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో సిపిఎం అగ్రభాగాన ఉండి పోరాడుతున్నదని తెలిపారు. దేశంలో సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా 1991 నుండి జరిగిన 21 సమ్మెలకు సిపిఎం మద్దతిచ్చిందని పేర్కొన్నారు. గతంలో మూడు వామపక్ష ప్రభుత్వాలు, నేడు కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రతీ పోరాటాన్ని ప్రోత్సహిస్తున్నదని అన్నారు. 2014ఎన్నికల్లో మోడీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న ఉద్యోగాలు తీసేసారని, గత పదేళ్ళలో కొత్తగా రిక్రూట్‌మెంట్‌ లేదని విమర్శించారు. పైగా విఆర్‌ఎస్‌ పధకాన్ని తెచ్చి ఉద్యోగులను బలవంతంగా బయటకు నెట్టిందని, ధరలు భారీగా పెంచి భారాలు వేస్తున్నారని, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. 
అదానీ గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని విజయవాడ పేలస్‌లో కలవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట (భావనపాడు) పోర్టులను ఆదానీకి అప్పగించడానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధపడుతున్నదని వెల్లడించారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరు కోపరేటీవ్‌ షుగరు ఫ్యాక్టరీలు మూసివేశారని, ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చడానికి, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లును బిగించి పంపిణీ విభాగాన్ని పూర్తిగా అదానీకి అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆగ్రహించారు. 
జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై సిపిఎం చేపట్టే ఉత్తరాంధ్ర బైక్‌యాత్రకు ప్రజలు, కార్మికులు బ్రహ్మరధం పడుతున్నారని తెలిపారు.. విశాఖలో గత రెండురోజులుగా ఈ యాత్ర సాగుతోందని, అక్టోబరు 5న బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. గత 950 రోజులు స్టీల్‌ కార్మికులు, ప్రజలు పోరాడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఈ పోరాటంలో చిత్తశుద్ధితో పాల్గొనకపోగా కేంద్ర బిజెపికి దాసోహమైపోయాయన్నారు. ఈ మూడు పార్టీల వైఖరి మార్చుకొని ప్లాంట్‌ పరిరక్షణ కోసం, ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావులు పాల్గొన్నారు.