Oct 12,2023 07:30
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష పేరిట సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ తరలింపు
  • మంత్రులు, ఉన్నతాధికారులకూ వసతి
  • త్రిసభ్య కమిటీ ఏర్పాటు
  • జిఓ విడుదల

ప్రజాశక్తి - అమరావతి : ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిఎంతో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు కార్యాలయాలు, వసతి సదుపాయాలను కూడా విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి జిఓఆర్‌టి నెంబర్‌ 2015ను బుధవారం జారీ చేశారు. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖకు చెందిన మానవ వనరుల విభాగ కార్యదర్శులను ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. 'ఈ కమిటీ తక్షణమే పని ప్రారంభించి సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పిస్తుంది' అని జిఓలో పేర్కొన్నారు. దసరా నాటికి విశాఖకు పరిపాలనను తరలిస్తామని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆ వ్యాఖ్యలకు తగినట్లుగానే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, పాలనను తరలిస్తున్నట్లు పేర్కొనకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం క్యాంపు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • జిఓలో ఏముంది...?

'ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ ఆ ప్రాంతంలో పర్యటించాల్సి వస్తుంది. ఆ సమయాల్లో ఉన్నత అధికారులు కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పర్యటించడంతోపాటు, రాత్రి పూట కూడా అక్కడే బస చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపేందుకు
ముఖ్యమంత్రి విశాఖలో బస (క్యాంప్‌) చేస్తారు. దీనివల్ల ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే చేరవేయడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు, ఇతర సహాయ సీనియర్‌ అధికారులకు వసతి సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేయాల్సి వస్తోంది' అని జిఓలో పేర్కొన్నారు.

  • ఎందుకోసం...?

'ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి వంటివి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, రవాణా సౌకర్యాల్లో పెద్దయెత్తున వెనుకబాటు ఉంది. పెద్ద సంఖ్యలో అత్యంత వెనుకబడిన గిరిజనులు ఈ ప్రాంతంలో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది' అని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వివరించింది. ఈ ప్రాంతంలోని రెండు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నట్లు జిఓలో పేర్కొన్నారు. చారిత్రకంగా ఉన్న ఈ వెనుకబాటును గుర్తించి, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం (2014)లో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారని జిఓలో తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్ర జిల్లాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని జిఓలో పేర్కొన్నారు.

  • అధికారులదే బాధ్యత...

సమీక్షలు, పర్యటనల కోసం వచ్చే వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌ఒడిలు, స్పెషల్‌ ఆఫీసర్లు విశాఖతోపాటు పరిసర ప్రాంతాల్లో వసతిని (ట్రాన్సిట్‌ అకామిడేషన్‌)ను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారమే అంతర్గత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాజా జిఓలోనూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సమీక్షల కోసం అధికారులు తరచూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుందని జిఓలో పేర్కొంది.