May 12,2023 21:01

- రైతులకు హక్కు పత్రాన్ని అందజేస్తున్న కలెక్టర్‌

రాయచోటి: చుక్కల భూములకు సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్‌ గిరీష తెలిపారు. శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు కావలి వేదిక నుంచి దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ చుక్కల భూముల చిక్కులకు జగనన్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారంలో భాగంగా రైతుల కుటుంబాలకు మేలు చేస్తూ చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో నుంచి కలెక్టర్‌ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో అన్నమయ్య జిల్లాలో చుక్కల భూములకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 30,525 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 28,882.29 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కుతో రూ.579.832 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన భూములకు పూర్తి హక్కులు ప్రభుత్వం కల్పించిందన్నారు. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ చుక్కల భూముల చిక్కులకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించి రైతన్నలకు సర్వ హక్కులూ కల్పించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములను సర్వ హక్కులతో క్రయవిక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వే హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగింపు జరిగిందన్నారు.