Mar 09,2023 22:18

పుట్టపర్తిలో ఓటు అభ్యర్థిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : చట్టసభలలో ప్రశ్నించే నాయకులు లేకపోతే అరాచకం రాజ్యమేలుతుందని,సమస్యలపై ప్రయత్నించి పోరాడే నాయకులకే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టం కట్టాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, సచివాలయాలు, మున్సిపాలిటీ ఉద్యోగులను ప్రజా సంఘాల నాయకులు కలిసి పిడిఎఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్‌ నాయకుడు ఇంతియాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, మాట్లాడుతూ ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ప్రశ్నించే నాయకులకు అవకాశం ఇవ్వకుంటే అవినీతి అక్రమాలు అరాచకం రాజ్యమేలుతుందని హెచ్చరించారు. ఓటు హక్కు ఉన్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులందరూ ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల ఉద్యోగులకు భద్రత లేదన్నారు. ఉద్యోగుల పక్షాన ప్రశ్నించేవారు ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, కార్మిక సంఘం నాయకులు పై పల్లి గంగాధర్‌, రామకృష్ణ, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నిత్యం పోరాడే పటిమ ఉన్నా ప్రజా నాయకులను శాసనమండలి ఎన్నికల్లో గెలిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎఐటియుసి జిల్లా నాయకులు వినోద్‌కుమార్‌ కోరారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐటియుసి ఆద్వర్యంలో విడివిడిగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తినరసింహరెడ్డిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో పట్టణంలో వివిధ పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఎఐటియుసి ఆద్వర్యంలో పట్టణంతో పాటు రూరల్‌ మండలంలోని సంతేబిదనూరు, చౌళూరు, కిరికెర, తుమకుంట, పంచాయతీల్లో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు బాబు, కృష్ణ, ఫక్రుద్దీన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.
నంబుల పూలకుంట : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్‌ిథ పోతుల నాగరాజును గెలిపించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం మండల కేంద్రంలోని పాఠశాలలు, కార్యాలయాలు, సచివాలయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి కరపత్రాలు, మోడల్‌ బ్యాలెట్లు అందజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును పిడిఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బడా సుబ్బిరెడ్డి, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.