బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ పలువురు సినీ ప్రముఖులు సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై నటుడు సూర్య కూడా స్పందించారు. ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గానీ, వారి గొంతు నొక్కడం కోసం కాదనీ అన్నారు సూర్య. సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సూర్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాన్నీ ప్రేక్షకుల వ్యతిరేకత పేరుతో ఆ చిత్రాన్ని తిరిగి సెన్సార్ చేయడం, ప్రదర్శన నిలిపివేయడం సరికాదన్నారు. ఇటీవల కేంద్రం తీరును సూర్య ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు.
పేరు : సూర్య
అసలుపేరు : శరవణన్ శివకుమార్
పుట్టిన తేదీ : జులై 23, 1975
భార్య : జ్యోతిక
చదువు : బికామ్
పిల్లలు : దేవ్, దియా
తల్లిదండ్రులు : శివకుమార్, లక్ష్మి
సోదరులు : కార్తీ, బృందా
తమిళనాడులో పుట్టి పెరిగిన నటుడు సూర్య తమిళం, తెలుగులోనూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన యాక్షన్ సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సౌత్ ఇండిస్టీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన భార్య జ్యోతిక సైతం తెలుగు జనాలకు సుపరిచితం. ఆమె కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది.
కోలీవుడ్‌తోపాటు.. టాలీవుడ్‌లోనూ...
కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్లో సూర్యకు ఉన్న డిమాండ్ ఆశ్చర్యం కలిగిస్తుంది. అగ్రహీరోలతో సమానంగా 20 కోట్ల మార్కెట్ ఉంది. లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైనప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి, స్వయంగా సూర్య ఫిదా అయిపోయాడట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్యకు 'ఆకాశం నీ హద్దురా' ఒక మంచి బ్రేకప్‌గా నిలిచింది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. కాగా ఈ చిత్రం 2022లో విడుదల కానుంది.
ట్విట్టర్ వేదికగా..
కాగా సినిమాటోగ్రఫీని సవరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి సినిమాటోగ్రఫీ బిల్లు 1952ను కేంద్రం మార్పు చేస్తుంది. 2019 ఫిబ్రవరి 12న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుత పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సవరణ కింద ఒకసారి సెన్సార్ చేసిన సినిమాలు తిరిగి సెన్సార్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నూతన చట్టానికి సామాజిక కార్యకర్తలతోపాటు.. పలువురు సినీ ప్రముఖులు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో కమల్‌హాసన్, డైరెక్టర్ కార్తీ సుబ్బరాజు ట్వీట్ చేయగా.. తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య సైతం ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
బిల్లుకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. ఈ నూతన బిల్లుపై సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిల్లుపై హీరో సూర్య స్పందిస్తూ 'ఈ నూతన చట్టం.. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడం కాదు.. దాని గొంతును పరిమితం చేయడమే అవుతుంది.' అంటూ కామెంట్ చేశాడు. 'సినిమా, మీడియా, విద్య అనేవి భారతదేశం యొక్క చిహ్నాలు వంటివి. కానీ వాటి చూపు, చెవులు, గొంతును మూసివేయడం సరైనది కాదు..
వీటి స్వేచ్ఛను అణచివేస్తే ప్రతికూల ప్రభావం చూడాల్సి వస్తుంది' అన్నారు.
ఎందరికో బాసటగా..
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గొంతెత్తడమే కాదు.. ప్రజలకు సేవ చేయడంలోనూ ముందుంటారు సూర్య. కరోనా క్లిష్టపరిస్థితుల్లో అనేకమంది అభిమానులకు గుప్త దానాలు చేశారు. తరుచూ ఫ్యాన్స్‌ను కలిసే సూర్య వారి కష్టాలను చూసి చలించిపోయారు. కరోనా నేపథ్యంలో తన ఫ్యాన్ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున మొత్తం రూ.12.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి, కట్టుకున్న సొంత ఇల్లును అనాథ పిల్లలకు రాసి ఇచ్చారు సూర్య. మొత్తం 128 మంది అనాథ పిల్లలను సూర్య దంపతులు దత్తత తీసుకున్నారు. వేల మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారు.