ప్రజాశక్తి - హిందూపురం : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకుని స్వశక్తితో మహిళలు ఎదగాలని జీవన జ్యోతి వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్, నెహ్రూ యువ కేంద్ర సభ్యురాలు నాగజ్యోతి, పద్మజ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ పద్మజ ప్రసాద్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మంగళవారం స్థానిక బిట్ కళాశాలలో మహిళా సదస్సును ప్రిన్సిపల్ రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను చేశాయనిఅయితే వాటిపై అవగాహన లేక పోవడం వల్ల ఎవరు వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. ప్రతి మహిళ చట్టాలను సమగ్రంగా ఆర్థం చేసుకోవాలన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలగాలన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు ఎదగాలన్నారు. మహిళా అధ్యాపకులకు, విద్యార్థినులకు కళాశాల ఛైర్మన్ డాక్టర్. పి చంద్ర మోహన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు వివిధ పోటీలను నిర్వహించి, ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.










