Jan 31,2023 21:57

సమావేశంలో పాల్గొన్న ఎస్పీ, తదితరులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాట, చోరీలపై ప్రత్యేక నిఘా పెంచాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ కి వచ్చే పిటీషనర్స్‌ పట్ల మర్యాదగా వ్యవహరించి త్వరితగతిన వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను కట్టడి చేయడంతో పాటు ఈ నేరాల్లో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోక్సో, తదితర కేసుల్లో అలసత్వం ఉండరాదన్నారు. ఈఏడాది జరిగిన గ్రేవ్‌ కేసులు అంతకు మునుపు పెండింగులో ఉన్న యుయుఐ కేసులు, ఫ్యాక్షన్‌ సంబంధిత కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులను సర్కిల్‌ వారీగా సమీక్ష చేశారు. చట్టాలు అనుసరించి మాత్రమే నిందితులను అరెస్టు చేయాలన్నారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలన్నారు. ముఖ్యంగా ఇసుక జిల్లా దాటరాదని కర్నాటక మద్యం జిల్లాలోకి ప్రవేశించరాదని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టి కీలక కేసుల్లో ఘటనా స్థలంలోని ఆధారాలు సక్రమంగా, శాస్త్రీయ పద్ధతులలో సేకరించి దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని,అప్పుడే నిందితులకు శిక్షలు పడే అవకాశముందని అన్నారు. ఈసమావేశంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కెవి. రామకృష్ణప్రసాద్‌, ఎస్‌బి డీఎస్పీ ఉమమహేశ్వర రెడ్డి, ఎస్‌బి సిఐ రవీందర్‌ రెడ్డి, సిఐ సుబ్బారావు, వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని పలువురు డీఎస్పీలు, పలువురు సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.