చెన్నై : నటుడు కమల్ హాసన్ నెలకొల్పిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ నుండి రాజీనామా చేసి డిఎంకె గూటికి వెళ్లిన నేతలపై నటి శ్రీప్రియ మండిపడ్డారు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారంటూ మహేంద్రన్‌నుద్దేశించి ఆమె విమర్శలు చేశారు. ఇటీవల పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్...రాజీనామా చేసి డిఎంకె చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుండి శ్రీప్రియ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మైలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా మక్కల్ నీది మయ్యం గెలుచుకోలేకపోయింది. దీంతో ఒక్కొక్కరిగా పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఎంఎన్‌ఎం గెలుపొందని కారణంగా పార్టీ వీడుతున్న నేతలంతా ..పార్టీలు మారేందుకు వీలుగా అన్ని పార్టీల చిహ్నాలు, రంగులు ఉన్న చొక్కాలను సిద్ధంగా ఉంచుకోవాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.










