చంద్రబాబుపై రాళ్ల దాడి అమానుషం : టిడిపి
ప్రజాశక్తి-కలిగిరి : మాజీ సిఎం చంద్రబాబునాయుడు కాన్వారుపై రాళ్ల దాడి చేయడం జగన్‌రెడ్డి అరాచకు పాలనకు నిదర్శనమని మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. శనివారం కలిగిరి పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబునాయుడు కాన్వారుపై రాళ్ల దాడి.. రాజకీయానికి పరాకాష్ట అని తెలియజేశారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ రెడ్డిలో ఫ్రస్టేషన్ పెరిగిపోయి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. యథా లీడర్.. తథా కేడర్.. అన్నట్టు జగన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుంటున్న వైసిపి మంత్రులు, ఎంఎల్‌ఎలు ఎంతకైనా బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు పర్యటనలో దాడి జరిగే అవకాశం ఉందని, భధ్రత పెంచమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యలు డిజిపికి, ప్రకాశం జిల్లా ఎస్‌పికి లిఖిత పూర్వక లేఖలు రాసినా కూడా ఎందుకు పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షనేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్ధనగ ప్రదర్శన చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి మెప్పు కోసం మరీ ఇంతలా దిగజారాలా తాడేపల్లి ప్యాలెస్, ఐప్యాక్ చెప్పిన దానికల్లా తలూపుతున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో నాలుగేళ్లుగా దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించికోని ఆదిమూలపు అదే దళితుల హక్కుల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై విషం చిమ్మడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి రౌడీ రాజకీయాలతో తమను భయపెట్టాలనుకుంటే అదే పగటి కలే అవుతుందని తెలిపారు. జగన్‌రెడ్డి కోడికత్తి డ్రామాలకు భయపడేవాళ్లు ఇక్కడెవరూ లేరని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నియంతల ఆగడాలు సాగవన్నారు. జగన్ రెడ్డిలా ఎగిరెగిరి పడిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని తెలియజేశారు. జగన్‌రెడ్డి అరాచకపాలనపై ప్రజలు కూడా ఆలోచన చేయాలని సూచించారు. ప్రజల మద్దతుతో రాక్షస పాలనకు చరమగీతం పలుకుతామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బిజ్జం కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు చీమల తాతయ్య, కల్లూరి చంద్రమౌళి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చాగంటి జయరామిరెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి పివి సుబ్బారావు, యూనిట్ ఇన్‌ఛార్జులు ఊసా మాల్యాద్రి, బోగ్గవరపు వేణు, గంగవరపు మధన్, సర్పంచులు పూసాల వెంగపనాయుడు, వరప్రసాద్, మాధవ్, పట్టణం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










