May 20,2023 22:05

ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు

చంద్రబాబునాయుడుపై వైసిపి విమర్శలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ముఖ్యంగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసే క్రమంలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంటే వాటిని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రేలాపనలు చేస్తున్నారని వైసిపి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనలతో పట్టణంలోని ఎంఎల్‌ఎ మేకపాటి క్యాంపు కార్యాలయంలో శనివారం పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 అంకణాల స్థలం శవాలు పాతిపెట్టడానికా.. అని చంద్రబాబు విమర్శించడం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
తాను రెండు ఎకరాలు కలిగిన పేదవాడినని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు పేదలనే విమర్శించడం అన్యాయమన్నారు. ఆయన అసంపూర్తిగా నిర్మించిన టిడ్కో భవనాల్లో లబ్ధిదారులకు ఎన్ని అంకణాల్లో ఇళ్లు నిర్మించారని వారు ప్రశ్నించారు. అర్ధాంతరంగా నిర్మాణాలు వదిలేసిన టిడ్కో ఇళ్లను జగన్మోహన్‌ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్న విషయం బాబుకు కనిపించడం లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు మంజూరు చేసిన ఘనత దేశంలోనే అత్యధికంగా ఇళ్లుగానీ, ఇళ్ల స్థలాలుగానీ పారదర్శకంగా పంపిణీ చేసింది ఆంధ్రపదేశ్‌ రాష్ట్రమేనని కేంద్రం కితాబిచ్చిన విషయం బాబు గుర్తించాలని వారు కోరారు. డిప్రెషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మురికివాడలా తయారవుతాయని పేదలను కించపరిచేలా బాబు మాట్లాడడం తగదని హితవు పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని జయంపు గ్రామంలో దళితులకు చెందిన భూమిని చంద్రబాబు ఆక్రమించిన విషయం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. అసలైన పేదలను గుర్తించి లేఅవుట్లు ఏర్పాటు చేసి అందరితో సమానంగా వేలాది మంది దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంటే హర్షించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా బాబు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో సొంత ఇళ్లులేని వారు ఉండకూడదనే లక్ష్యంతో వైఎస్‌ జగనన్న ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని ఆ లక్ష్యం నెరవేరేలా తాము వెన్నంటే ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వెంకట రమణమ్మ, వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్దార్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు పొడమేకల పెంచలయ్య, శివకోటారెడ్డి, వైసిపి నాయకులు సయ్యద్‌ జమీర్‌, కొప్పోలు చిన్నపరెడ్డి, జైపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.