అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే జనం తరిమికొడతారని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఎపి ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయి వరుస ట్విట్లు చేశారు. 'రాయలసీమలో అడుగు పెడితే చంద్రబాబును జనం చితక్కొట్టేలా ఉన్నారు. కోస్తాకు వస్తే కారం పెడతారు. ఉత్తరాంధ్రకు వస్తే ఉతికి ఆరేస్తారు. అందుకే హైదరాబాద్ అద్దాలమేడలో దాక్కున్నాడు ఈ టూరిస్ట్ పొలిటీషియన్' అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ట్వీట్‌లో 'ఉచిత విద్యుత్తు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, ఇందిరమ్మ ఇళ్లు, 84 నీటి పారుదల ప్రాజెక్టులు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దివంగత మహానేత వైఎస్‌ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. ఆయన జన్మదినం పది కోట్ల తెలుగు ప్రజలకు పండగ రోజు' అంటూ పేర్కొన్నారు.










