చల్లారని అసంతృప్తి సెగలు : కొనసాగిన వైసిపి ప్రజాప్రతినిధుల రాజీనామా పర్వం
- రెండూ రోజూ కొనసాగిన ఆందోళనలు
- అధిష్టానం దౌత్యంతో బెట్టువీడిన బాలినేని
- అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా : సుచరిత
ప్రజాశక్తి- యంత్రాంగం : తమ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు వారి అనుచరులు కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లో రెండో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు మంత్రి పదవి రానందున అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించేందుకు వైసిపి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అసంతృప్తి ఎమ్మెల్యేలు మెత్తబడ్డారు. తాము పార్టీకి విధేయులమేనని ప్రకటించారు. ఉదయభాను అనుచరులు, వైసిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రధాన కూడళ్లలో సోమవారం నిరసన తెలిపారు. బస్‌స్టాండ్, విజయవాడ రోడ్డు, బంగారు కోట్ల సెంటర్లలో రోడ్లపై టైర్లు తగులబెట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా తామంతా పార్టీ పదవులకు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు జోక్యం చేసుకొని మంటలను అదుపు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఉయ్యూరులో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ నాయకుడికి సముచిత స్థానం కల్పించకపోతే పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. గత కేబినెట్‌లో ఉన్న ఎస్‌సి మంత్రులందరినీ కొనసాగించి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరితకు మళ్లీ అవకాశం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆమె అనుచరులు గుంటూరులో ఆందోళనకు దిగారు. గుంటూరు కార్పొరేటర్లు ఐదుగురు, పలువురు జెడ్‌పిటిసి సభ్యులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై సుచతిత స్పందిస్తూ, తనకు మద్దతుగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవ్వరూ రాజీనామా చేయవద్దని కోరారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. మంత్రి పదవి రెండున్నర ఏళ్లుఅని సిఎం జగన్ ముందే చెప్పారని, ఆ మేరకు తనకు మళ్లీ పదవి ఇవ్వకపోయినా తనకు బాధ లేదని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనకు బాధ కలిగించాయని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను జగన్ వెంటే ఉంటానని, పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు బెట్టువీడారు. సజ్జల రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మూడు విడతలుగా జరిపిన చర్చలు ఫలించాయి. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, వైఎస్ కుటుంబానికి తాము విధేయులమని బాలినేని ప్రకటించారు. బాలినేనితో నాయకులు చర్చలు జరుగుతున్న సమయంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలులో మేయర్ సుజాతతో పాటు అన్ని వార్డుల వైసిపి కార్పోరేటర్లు మంగమూరురోడ్డులో బైటాయించి రాస్తోరోకో చేశారు. అనంతరం రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసనగా ఆయన అనుచరులైన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, రుద్రరాజు శ్రీదేవి రాజీనామా చేస్తూ సోమవారం కమిషనర్ అనుపమ అంజలికి లేఖలు ఇచ్చారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని తమ నాయకుడికి న్యాయం జరగకపోవడంతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో వైసిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. చోడవరం మండలంలో పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు.










