- పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- కొనుగోళ్లలో జాప్యంతో అయోమయంలో రైతులు
- ధాన్యపు రాసుల వద్ద కాపలా
- మద్దతు ధరలోనూ నిరాశే
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : చి'వరి'కి రైతుకు ఎదురుచూపులు తప్పడంలేదు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పేరుకే తప్ప రైతుల వద్ద నుంచి ఇంతవరకు ఒక్క ధాన్యపు గింజా కొనుగోలు చేయలేదు. రైతు పండించిన పంటను పొలాల్లోనూ, కల్లాల్లోనూ దాచుకొని రాత్రినకా పగలనకా కాపలా కాయాల్సి వస్తోంది. రైతులు పంట పెట్టుబడికి ఖరీఫ్‌కు ముందే అప్పులు చేశారు. నేడు ధాన్యం కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీ భారం పెరిగిపోతుందని వారు వాపోతున్నారు.
మద్దతు ధరపై నిరాశ
విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3,19,680 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. గతేడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం 22,510 ఎకరాలకు పెరిగింది. సీజన్ ప్రారంభంలో కాస్త వర్షపులోటు ఉన్నప్పటికీ ఆగస్టులో కురిసిన వర్షాలు, పొట్ట, వెన్నుపొడిచే దశల్లో వాతావరణం రైతులకు అనుకూలించాయి. దీంతో ఎకరాకు 24 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించారు. అయితే మద్దతు ధర విషయంలో రైతులకు నిరాశ తప్పలేదు. గతేడాది క్వింటా 'ఎ' గ్రేడ్ ధాన్యం ధర రూ.1888 నుంచి ఈ ఏడాది రూ.1960కు, సాధారణ రకం ధర రూ.1868 నుంచి రూ.1940కు పెరిగింది. అంటే క్వింటాపై ఈ ఏడాది పెంచింది కేవలం రూ.72 మాత్రమే. డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు గతం కన్నా పెరగడంతో ఆ మేరకు పెట్టుబడి రూ.వేలల్లో పెరిగింది.
సేకరణలో అలసత్వం
ఈ ఏడాది ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని, ఇందులో వినియోగానికిపోనూ 5.40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతి ఆర్‌బికెలోనూ ధాన్యం సేకరిస్తామని, ఇప్పటికే తేమ శాతం గుర్తించే సాధనాలు, తూనిక యంత్రాలు, ఇతర పనిముట్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచామని ప్రకటించారు. గతంలో కేవలం 252 మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాలను 634కు పెంచామని, ప్రతి గింజా కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు. ఆచరణరలో ఇప్పటివరకు పది రోజుల్లో 400 టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. 'మేము వరి నూర్పులు చేసి 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదు. ఇంకా గోనె సంచులు రాలేదని చెబుతున్నారు. అప్పటి వరకు ఆగాల్సిందేనని ఆర్‌బికె సిబ్బంది చేతులెత్తేస్తున్నారు' అని గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన చల్ల పెంటయ్య, పెంటపల్లి సత్యనారాయణ, వసంత సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా నాట్లుపడిన పార్వతీపురం ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తోటపల్లి ఆయుకట్టు పరిధిలోని జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, గుర్ల, చీపురుపల్లి తదితర మండలాల్లో సకాలంలో నాట్లు పడటంతో 20 రోజుల క్రితమే వరి నూర్పులు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఏజెన్సీ మండలాల్లో ఏనుగులు స్వైరవిహారం చేస్తుండటంతో కల్లాల్లో ధాన్యం కాపలాకు వెళ్లలేకపోతున్నామని, దొంగల భయం వెంటాడుతోందని గిరిజన ప్రాంత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుంటే ఎప్పటిలాగే దళారులకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి నూర్పుచేసి 20 రోజులు కావస్తోంది
నేను ఐదెకరాల్లో వరి సాగు చేశాను. దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తరపున కొనుగోలుకు ముందుకు రాలేదు. 20 రోజుల క్రితమే వరి నూర్పు చేశాను. ప్రస్తుతం కల్లంలోనే ధాన్యం ఉంది. వణికించే చలిలో కాపలా ఉంటున్నాం. ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగులు ఏ క్షణాన దాడి చేస్తాయోనని భయంగా ఉంది. మరోవైపు ఆకస్మికంగా వర్షాలు పడితే చేతికందిన పంట నాశనమైనట్టే.

మల్లిన కృష్ణమూర్తి
సుభద్రమ్మవలస, జియ్యమ్మవలస మండలం










