Jan 07,2023 21:26

రోడ్డుపై బైటాయించిన రైతులు, గ్రామస్తులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : చిత్రావతి నది నుంచి ఇసుక తీసుకెళుతున్న టిప్పర్‌ను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లి సమీపంలో చిత్రావతి నది నుంచి ఇసుక తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంతెనకు 50 మీటర్ల దూరంలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించి ఇసుకను తోడేస్తున్నారన్నారు. దీంతో వరదలు వచ్చినప్పుడు వంతెన కొట్టుకుపోతోందనాన్రు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తవ్వకాలు నిలుపుదల చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని బీష్మించుకుని కూర్చొన్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఎస్‌ఐ బాబ్జాన్‌ అక్కడికి చేరుకొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు, గ్రామస్తులు శాంతించారు.