Mar 24,2023 22:10

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్‌ అవుటాల రమణారెడ్డి

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : చిరుధాన్యాల సాగు చేయడానకి రైతులను అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ మండల చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఈ సమావేశం లో రమణారెడ్డి మాట్లాడుతూ పంటల నమోదుకు సంబంధించి ఈ క్రాపింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి నమోదు పక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగు గురించి రైతులలో అవగాహన కల్పించాలన్నారు. 62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని వారందరికీ తగిన సహకారం ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చిరుధాన్యాలను రైతులకు సబ్సిడీతో అందించి సాగుపై అవగాహన కల్పించాలన్నారు. రబీ సీజన్‌ కు సంబంధించి విత్తనాల సరఫరా, ఎరువులు, పంటల బీమా నమోదు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సోమందేపల్లి మండలంలో హంద్రీనీవా నీటి కాలువ ద్వారా 150 మంది రైతులకు సాగునీరు అందించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా ప్రకటించినందున చిరుధాన్యాల సాగుకు రైతులలో అవగాహన కల్పించాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల, పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఏ యంత్ర పరికరాలు ఎంతకు అద్దెకు దొరుకుతాయన్న వివరాలు, ఎరువులు విత్తనాలు వివరాలు ఆర్‌ బి కె లో ప్రదర్శించాలన్నారు. పాడి ఉత్పత్తులను పెంపొందించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ, రైతులు పండించిన పంటల వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ సీడ్స్‌ డిఎం ధనలక్ష్మి, మార్కెటింగ్‌ శాఖ అధికారి గీతమ్మ, డ్వామా పీడీ రామాంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్‌, సిరికల్చర్‌ జేడీ పద్మమ్మ, పశుసంవర్ధక శాఖ ఎడి శుభాదాస్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.