Mar 04,2023 21:40

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ జి.ఎల్‌.శివజ్యోతి

చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : చిరుధాన్యాలలో ఉన్న విశేష గుణాలను గుర్తించిన ఆహార శాస్త్రవేత్తలు చిరుధాన్యాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. చిరుధాన్యాల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుపై కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం శిక్షణా కార్యక్రమం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.ఎల్‌.శివజ్యోతి మాట్లాడుతూ చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, సజ్జలు, రాగులు, జొన్నలు, ఊదలు ఆరికెల సాగుపై మక్కువ పెంచాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని, నీటి వినియోగం తక్కువగా ఉండి పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదన్నారు. ఈ శిక్షణతో మహిళలు ఆర్థికంగా మెరుగుపడటానికి మంచి అవకాశం ఉందని స్వయం ఉపాధి దిశగా నడవాలన్నారు.
చిరుధాన్యాల పోషక విలువలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌గా ప్రకటించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటి ఉత్పత్తి పెంచడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. అతి తక్కువ పెట్టుబడితో పండించే మిల్లెట్స్‌తో అధిక ఆదాయం వచ్చే మార్గాలను పెంపొందించిం దన్నారు, చిరుధాన్యాల్లో ఇనుము, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు అధికమని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు తగినట్లుగా రోజువారి ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి మహిళలను ఉపాధి అవకాశాల దిశగా నడిపించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్ధానం, పెరుమాలపల్లి, ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్‌ వి.సుమతి ముఖ్య అతిథిగా పాల్గొని చిరుధాన్యాల సాగు విధానాలను వివరించారు. రైతులందరూ వీటిని కొద్ది పొలంలో సాగు చేసి రోజువారీ ఆహారంలో భాగంగా వినియోగించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు పర్యావరణ హితం, పౌష్టికాహార విలువలున్న ఈ చిరుధాన్యాల వంటి పంటలను రైతులు సాగుచేస్తే భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. చిరుధాన్యాల సాగులో పురుగులు, తెగుళ్ల యాజ మాన్యం గురించి సస్యరక్షణ గూర్చి వివరించారు. చిరుధాన్యాల సాగు విస్తృతి పెరగకపోవడం, డిమాండ్‌కు తగ్గట్లు వాటి లభ్యత లేకపోవడంతో ధరలు సామాన్యులు అందుకోలేకుండా పోతున్నారన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలతో మిక్సిడ్‌ మిల్లెట్‌ లడ్డూలు, మురుకులు, చిరుధాన్యాల బిస్కెట్లు తయారీ విధానంపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పంటల ఉత్పత్తి విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ డి.విజరుకుమార్‌నాయక్‌, విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.లోకేష్‌బాబు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌ సుజాత పాల్గొన్నారు.