Dec 11,2022 22:16

జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జెవివి నాయకులు, తదితరులు

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్ఫథం అలవర్చుకోవాలని వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సత్యసాయి జిల్లా చెకుముకి సైన్స్‌ సంబరాలు స్థానిక వశిష్ట ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌లో ఆదివారం జరిగాయి. జెవివి జిల్లా ఉపాధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సైంటిస్టు వేమన, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెవివి జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని అప్పుడే శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సమాజాన్ని అభివద్ధి పథంలో నడపడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సైంటిస్ట్‌ వేమన మాట్లాడుతూ వాతావరణంలో విపరీతమైన మార్పులకు మానవుని అజ్ఞానమే కారణమన్నారు. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక మూడు దశాబ్దాలుగా ప్రజలలో విద్యార్థుల్లో మూఢ నమ్మకాలను రూపుమాపడానికి కృషి చేస్తోందన్నారు. అందుకు మనమందరం తగినంత సహకారం అందించాలని సైన్స్‌ పై అభిరుచి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కళాకారులు శ్రీరాములు, రామాంజనేయులు ఆలపించిన పాటలు, మ్యాజిక్‌ షో ఆకట్టుకున్నాయి. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆదిశేషు ఆధ్వర్యంలో చెకుముకి జిల్లా స్థాయి పరీక్షను నిర్వహించారు. అందులో కేశవాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రయివేటు పాఠశాలల విభాగంలో కదిరి పట్టణానికి చెందిన వాల్మీకి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వీరు రాష్ట్రస్థాయిలో జరిగే చెకుముకి సైన్‌ సంబరాలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ శివశంకర్‌ రెడ్డి. ప్రిన్సిపల్‌ జయసింహ రెడ్డి విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసారెడ్డి, గౌస్‌ లాజం, పవన్‌, రమణ నాయక్‌ ,వెంకటచలమయ్య, ఎల్లప్ప, రఘునాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.