ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : భవిష్యత్తు తరాల పిల్లల ఆరోగ్యం కోసం రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వైద్యాధికారి ఎస్‌వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా కోఆర్డినేషన్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలన్నారు. ఈనెల 14, 18 తేదీలలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నికల్, అంగనవాడీ కేంద్రాలలో ఒకటి నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు మింగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ మీనాక్షి, పోగ్రాం అధికారి కుళ్లాయిస్వామి, డాక్టర్ నివేదిత, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, బిసి, ఎస్‌టి, ఎస్‌సి సంక్షేమ శాఖ అధికారులు నిర్మల జ్యోతి, శివ రంగ ప్రసాద్, మోహనరావు, పుట్టపర్తి కమిషనర్ వెంకటరామిరెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










