Jun 27,2022 23:04

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ డిల్లీరావు

ప్రజాశక్తి-విజయవాడ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక పురోగతికి దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల దినోత్సవ సందర్భంగా స్థానిక ఆటోనగర్‌లోని ది విజయవాడ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పరిశ్రమలను నిర్వహించడం, లక్షలాదిమందికి జీవనోపాధిని కల్పించడంతో దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారన్నారు. దేశానికి సంపద సృష్టించేది ఈ పారిశ్రామిక వేత్తలేనని, వ్యవసాయం తరువాత అత్యధిక శాతం మంది ప్రజలు పరిశ్రమలపై ఆధారపడుతున్నారని కలెక్టర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 63.4 మిలియన్‌ యూనిట్ల ద్వారా దాదాపు 120 మిలియన్ల జనాభాకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రవేశపెట్టి ప్రతి ఏడాది పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తుందని, ప్రతిసారీ మన రాష్ట్రమే మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల నైపుణ్యానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. మన జిల్లాలో యంఎస్‌యంల అభివృద్ధికి తోడ్పాటును అందించి ఆర్థిక ప్రగతికి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఐటిఐ పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల వంటి వృత్తిపరమైన కళాశాలలలో అధునాతనమైన కోర్సులలో శిక్షణ అందించి, సుశిక్షితులకు బ్యాంకు మేనేజర్లతో సమన్వయపరచి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో నాలుగు ఇండిస్టియల్‌ పార్కులు ఉండగా మరో రెండింటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1960లో ప్రారంభమై దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని, కీర్తిప్రతిష్టలను సంపాదించుకున్న ఆటోనగర్‌ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం త్రాగునీరు, డ్రైనేజ్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, మైక్రో స్మాల్‌ మీడియం పరిశ్రమల (యంఎస్‌యంఇ) పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు తమ వంతు కృషిచేస్తానని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో ఆటోనగర్‌ ఐలా అధ్యక్షులు సుంకర దుర్గాప్రసాద్‌, కొండపల్లి ఐలా అధ్యక్షులు రామలింగేశ్వరరావు, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బి శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఏపిఎస్‌ఐఏ అధ్యక్షులు వి మురళికృష్ణ, కార్యదర్శి రామచంద్రరావు, ఐలా కమీషనర్‌ ఝన్సీలక్ష్మి, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియ జనరల్‌ మేనేజర్‌ వసంత కుమార్‌, జిల్లాకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.