Dec 15,2022 21:20

హిందూపురం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

       హిందూపురం : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చిల్లచేష్టలు చేస్తూ గ్రూపు తగాదాలను చేసే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసిపి శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన సత్యసాయి జిల్లాల పరిధిలోని మడకశిర, హిందూపురంలో పర్యటించారు. ఉదయం మడకశిరలో, మధ్యాహ్నం హిందూపురంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలలను నిర్వహించారు. ఈ సందర్భంగా అసమ్మతి నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో నిర్వహించిన సమావేశంలో ఘాటుగానే స్పందించారు. చిల్లర చేష్టలు చేస్తే సహించేది లేదని, పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరిస్తే ఎంతటి వారిపైన అయినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా వైసిపి నాయకులు కష్టపడి ఆయన గెలుపునకు పనిచేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురంలో వైసిపి ఓడిపోతే తాను జిల్లాలో ఇక అడుగు పెట్టనని స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి గెలవబోతోందంటూ జోస్యం చెప్పారు. కుప్పంలోనే గెలవబోతుంటే హిందూపురంలో ఎందుకు గెలవలేమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతత్వంలో వైసిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివద్ధి పనులను ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. నాయకులు అంకితభావంతో పని చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైసిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, ఏపీ ఆగ్రో సంస్థ ఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైసిపి మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌లు జబివుల్లా, బాలరామిరెడ్డి, నాయకులు మధుమతి రెడ్డితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.