ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జిఒ నెంబర్1ని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టిడిపిి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై గురువారం పట్టణంలో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. టిడిపి కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి రాగానే పట్టణ సిఐ నరసింహారావు ర్యాలీకి అనుమతి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకులు పట్టించుకోని ర్యాలీని ఆర్‌అండ్‌బి బంగ్లా వరకు కొనసాగించారు. అక్కడున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిఒ నెంబర్1 ప్రతులను చింపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపుచర్య అని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










